Homemain slidesతొక్కిసలాటలో ఊపిరాడక 121 మంది మృతి

తొక్కిసలాటలో ఊపిరాడక 121 మంది మృతి

భారత్ సమాచార్, ఉత్తర్ ప్రదేశ్ ;

ఆధ్యాత్మికానికి… మూర్ఖత్వానికి మధ్య చాలా తేడా ఉంటుంది. ఆధ్యాత్మికం పేరుతో మూర్ఖంగా భక్తుల ప్రాణాలు బలిగొంటున్నారు దొంగ బాబాలు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో ఒక భోలే బాబా గా ప్రసిద్ధి చెందిన దొంగ బాబా జరిపిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 121 మంది మరణించారు. అసలు ఈ బాబా ఎవరు? ఇంత మంది భక్తులు ఒకే చోట ఎందుకు చేరుకున్నారు. బాబా నిర్వహించిన కార్యక్రమం ఏమిటి? మొత్తం వివరాలు తెలుసుకుందాం…

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌లో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదం నింపింది. ఈ దుర్ఘటనలో 121 మంది ప్రాణాలు కోల్పోగా, ఇంకా చాలా మంది సమీప ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఒక బాబా నిర్వహించిన కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు రావడం, పెను విషాదం జరగడం యావత్ దేశాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది.

ఎవరీ ‘భోలే బాబా’?

భోలే బాబా అసలు పేరు నారాయణ్​ సాకార్ హరి. ఉత్తర్​ప్రదేశ్​లోని ఎటా జిల్లా పటియాలి తహసీల్‌లోని బహదూర్‌ గ్రామానికి చెందిన బాబా సాకార్‌ విశ్వ హరి లేదా ‘భోలే బాబా’గా ప్రసిద్ధి చెందారు. బాల్యంలోనే తండ్రితో కలిసి వ్యవసాయం చేసేవాడట. గతంలో ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో పనిచేసినట్లు ఈ భోలే బాబా చెప్పుకునేవాడు. 26 ఏళ్ల క్రితమే ఉద్యోగం నుంచి వైదొలిగి, ఆధ్యాత్మిక బాట పట్టినట్లు ప్రచారం చేసుకున్నాడు. తనకు గురువు ఎవరూ లేరని, కేవలం సమాజహిత కోసమే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు చెబుతుంటాడు.

వేల సంఖ్యలో భక్తులు

ఆ తర్వాత కాలంలోనే వేల సంఖ్యలో భక్తులు భోలే బాబాను అనుసరించడం మొదలు పెట్టారు. అలీగఢ్‌తోపాటు హాథ్రస్‌ జిల్లాల్లో ప్రతి మంగళవారం ‘సత్సంగ్‌’ పేరుతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు. ఇందుకు వేల సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. ఉత్తర్‌ప్రదేశ్‌ కాకుండా ఉత్తరాఖండ్‌, హరియాణా, రాజస్థాన్‌, దిల్లీతోపాటు దేశవ్యాప్తంగా భోలే బాబాకు లక్షల మంది అనుచరులు ఉన్నారు. కార్యక్రమాల నిర్వహణకు వాలంటీర్లు ఉంటారు. కొవిడ్‌ మహమ్మారి సమయంలోనూ భారీ సంఖ్యలో భక్తులు భోలే బాబా కార్యక్రమాలకు హాజరయ్యారు.

తొక్కిసలాటలో ఊపిరాడకే…

తాజాగా ఉత్తర్​ ప్రదేశ్ లోని ఫుల్‌రాయ్‌ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ క్రమంలో బాబా పాదాల వద్ద ఉన్న మట్టిని తీసుకునేందుకు భక్తులు పోటీపడుతున్న సమయంలో తొక్కిసలాట జరిగినట్లు సమాచారం ఉంది. దాంతో ఊపిరాడక అనేక మంది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులే ఉండటం అత్యంత బాధాకర విషయం.

‘‘సత్సంగ్ కార్యక్రమాన్ని నిర్వహించిన కమిటీపై, బాబాపై కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం.’’ అని అలీగఢ్ ఐజీ శలభ్ మాథుర్ చెప్పారు.

మరికొన్ని వార్తా విశేషాలు…

విజయ్ మాల్యాకు నాన్ బెయిలబుల్ వారెంట్

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments