భారత్ సమాచార్, రాజకీయం : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో డజన్ మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని, అయితే వాళ్లకు వచ్చే ఎన్నికల్లో వచ్చేది మాత్రం కేవలం 20 సీట్లేనని సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో ఎద్దేవా చేశారు. అధికారంలోకి వస్తామని ఆ పార్టీ నాయకులు పగటి కలలు కంటున్నారని, వాళ్లు గెలిచేది లేదు.. సచ్చేది లేదు.. అదొట్టి గ్యాస్.. మళ్లా గదే 20 సీట్లు.. వస్తాయని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం మధిర, వైరా, డోర్నకల్, సూర్యాపేట నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు.
‘‘కాంగ్రెస్ పార్టీ 50 ఏండ్లు పాలించింది.. అప్పుడు పేదల బతుకులు ఎట్లా ఉండే మనకు తెల్వదా ? దళితుల బతుకులు ఎలా ఉండే ? అన్నదాతల పరిస్థితి, సమస్యలు ఎట్లా ఉండే ? జనాలంతా కూడా కొంచెం సేపు గట్టిగా ఆలోచించాలి. గత పదేండ్లలో బీఆర్ఎస్ పాలన ఎలా ఉందో బేరీజు వేసుకోవాలని గులాబీ బాస్ ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ రాజ్యం తెస్తామని ప్రగాల్భాలు కొడుతున్నారు.. అసలు ఇందిరమ్మ రాజ్యంలో బాగుపడ్డదెవరని ఓటర్లను ప్రశ్నించారు.
‘‘దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలు మీటర్లు పెట్టినయ్.. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే పెట్టలేదు. అందుకే వీళ్లకు డబ్బులు కట్ చేశాం. రూ.20 వేల కోట్లు ఆపి వాళ్ల నోట్ల మన్ను బోసినం’’ అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఒప్పుకున్నారని కేసీఆర్ ఆమెపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
కొంతమంది అహంకారులు నోట్ల కట్టలు హైదరాబాద్ లో దొరకుతున్నాయని, వాళ్లు డబ్బుల అహంకారంతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని కొందరి నాయకులపై పెద్ద ఎత్తున ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అసెంబ్లీ గడప తొక్కనీయకపోవడానికి వీళ్లేవరని ప్రశ్నించారు. అసెంబ్లీకి ఎవరినీ పంపాలో నిర్ణయించేది తెలంగాణ ప్రజలు కదా? ఆ ఓటు మీ దగ్గరే ఉంది కదా? అందుకే ఈ నోట్ల కట్టల ఆసాములకు మీ ఓటుతోనే గుద్ది బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.