భారత్ సమాచార్.నెట్, ఆంధ్రప్రదేశ్: ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma)కు ఏపీ హైకోర్టు (AP Highcourt)లో ఊరట దక్కింది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడం, మార్ఫింగ్ ఫోటోలను షేర్ చేసిన కేసులో విచారణకు హాజరుకావాలంటూ వర్మకు ఏపీ సీఐడీ (CID) పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నోటీసులను ఆర్జీవీ హైకోర్టులో సవాల్ చేశారు.
తాజాగా ఈ పిటిషన్‌ను విచారించిన ఏపీ హైకోర్టు ఆర్జీవీకి ఊరటనిచ్చింది. వర్మపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీకీ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది. కాగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌పై గతంలో సోషల్ మీడియాలో వర్మ పెట్టిన పోస్టులపై కూడా కేసులు నమోదు అయ్యాయి. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా తీశారని, ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మిడియాలో పెట్టారనే ఆరోపణలతో ఆర్జీవీపై ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరిలో కేసులు నమోదు అయ్యాయి.
అయితే ఈ కేసులో విచారణకు హాజరు కావాలని ఇప్పటికి సీఐడీ అధికారులు రెండుసార్లు నోటీసులు పంపారు. ఫిబ్రవరి 10న మొదటిసారి నోటీసులు జారీ చేశారు. కానీ వర్మ విచారణకు రాలేదు. మార్చి 5న కూడా మళ్ళీ సీఐడీ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో విచారణకు రావాలని సీఐడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులపై రాంగోపాల్ వర్మ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఆర్జీవీకి ఊరట కల్పించింది.