Homebreaking updates newsAyodhya: అయోధ్యలో అపురూప ఘట్టం.. శ్రీరామనవమి వేళ బాల రాముడి నుదిటిపై సూర్య తిలకం

Ayodhya: అయోధ్యలో అపురూప ఘట్టం.. శ్రీరామనవమి వేళ బాల రాముడి నుదిటిపై సూర్య తిలకం

భారత్ సమాచార్.నెట్, అయోధ్య: శ్రీరాముడి జన్మస్థలంగా ప్రసిద్ధిగాంచిన అయోధ్య (Ayodhya)లో శ్రీరామనవమి (Sri Rama Navami) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీరామనవమి వేడుకల సందర్భంగా అయోధ్య రామమందిరం (Ayodhya Ram Mandir)లో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. బాలరాముడి నుదుటిన సూర్య కిరణాలు (Surya Tilak) ప్రసరించాయి. శ్రీరామనవమి తిథి రోజున సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలు బాల రాముడి నుదిటిపై ప్రకాశిస్తూ.. సుమారు 4 నిమిషాల పాటు అలాగే దర్శనమిచ్చింది. ఇదంతా చూసిన భక్తులు ఆనందంతో పాటు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఈ సంప్రదాయం రాముడి జన్మ సమయాన్ని సూచించే మధ్యాహ్నం 12 గంటలకు జరిగింది. ఇది ఇక్ష్వాకు వంశానికి కులదైవమైన సూర్య భగవానుడితో రాముడి సంబంధాన్ని ప్రతిబింబిస్తుందని భక్తుల విశ్వాసం. ఇక ఈ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేసింది. ఈ దృశ్యాన్ని చూసిన భక్త జనసంద్రం జై శ్రీరామ్ అంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. గతేడాది జనవరిలో అయోధ్య రామమందిరంలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట జరిగిన సంగతి తెలిసిందే.
ఇకపోతే ప్రతీ శ్రీరామ నవమి రోజున ఇక్కడ బాలరాముడి నుదిటిపై నేరుగా సూర్యకిరణాలు తిలకంగా పడేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సంఘటన కోసం ఆలయంలో అద్దాలు, లెన్స్‌లతో కూడిన ప్రత్యేక సాంకేతిక వ్యవస్థను ఉపయోగించారు. దీని ద్వారా సూర్య కాంతి గర్భగుడిలో విగ్రహంపై ఖచ్చితంగా ప్రసరిస్తుంది. కాగా 2024లో జరిగిన మొదటి సూర్య తిలకం అనంతరం ఈ సంఘటన రెండో సంవత్సరం కూడా భక్తులను ఆకర్షించింది.
RELATED ARTICLES

Most Popular