HomeCM ViewStock Market: ట్రంప్ టారిఫ్‌ల ఎఫెక్ట్: స్టాక్ మార్కెట్లలో 'బ్లడ్ బాత్'!

Stock Market: ట్రంప్ టారిఫ్‌ల ఎఫెక్ట్: స్టాక్ మార్కెట్లలో ‘బ్లడ్ బాత్’!

భారత్ సమాచార్. నెట్ ముంబయి: ట్రంప్‌ టారిఫ్ ల ప్రకటన ప్రపంచ మార్కెట్లను కుదిపేసింది.అటు ఆసియా మార్కెట్లు కూడా భారీగా పతనమవడంతో దేశీయ సూచీల్లో సోమవారం ‘బ్లడ్‌ బాత్‌’ కన్పించింది. ఆర్థిక మాంద్యం భయంతో లోహ కంపెనీల షేర్లు భారీగా నష్టపోయాయి. నిఫ్టీలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ ఏకంగా రూ.20 లక్షల కోట్ల మేర సంపద ఆవిరైపోయింది. మార్కెట్ ఓపెనింగ్‌లో సెన్సెక్స్‌ 3,200 పాయింట్లకు పైగా పడిపోయి 72,130 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 1,000 పాయింట్లకు పైగా నష్టంతో 21,880ల వద్ద కొనసాగుతోంది. రూపాయి మారక విలువ కూడా 19 పైసలు తగ్గి 85.63 వద్ద కదులుతోంది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సుంకాలు ప్రపంచ మార్కెట్‌లలో కలకలం రేపుతున్నాయి. వాణిజ్య యుద్ధం భయాలు పెరిగి, మార్కెట్ సెంటిమెంట్ ప్రతికూలంగ పడింది. సోమవారం ఉదయానికే ఈ ప్రభావం కనిపించింది. ప్రీ-ఓపెనింగ్ సెషన్ నుంచే సెన్సెక్స్ దాదాపు 4,000 పాయింట్ల వరకు పడిపోయింది. ఆసియా మార్కెట్లు కూడా అదే బాటలో నష్టాలను నమోదు చేశాయి. జపాన్ నిక్కీ ఒక దశలో 8% వరకు క్షీణించగా, తైవాన్ సూచీ 9.6%, చైనా షాంఘై 6.5%, దక్షిణ కొరియా 4.1%, ఆస్ట్రేలియా మార్కెట్లు 3.8% నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. 2008 ఆర్థిక మాంద్యం తర్వాత ఇలా భారీ పతనాన్ని ఆసియా సూచీలు చూడటం ఇదే మొదటిసారి. అమెరికా ఫ్యూచర్ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ఉన్నాయి – డౌజోన్స్ 2.2% మేర నష్టంతో ట్రేడ్ అవుతోంది. ఇక, గిఫ్ట్ నిఫ్టీ 900 పాయింట్లకు పైగా పడిపోయింది. ఇది నేటి ట్రేడింగ్ ప్రారంభంలోనే దేశీయ సూచీల భారీ పతనానికి దారితీసింది. సెన్సెక్స్ 3.5% పతనమవ్వగా, నిఫ్టీ 2020 తర్వాత అత్యధిక నష్టాన్ని చవిచూసింది. అప్పట్లో కరోనా పీక్స్ సమయంలో ఇదే విధంగా మార్కెట్లు కుదేలయ్యాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆ ఏడాది మార్చి 23న సెన్సెక్స్‌ దాదాపు 4వేల పాయింట్లు, నిఫ్టీ 1135 పాయింట్లకు పైగా నష్టపోయాయి

RELATED ARTICLES

Most Popular

Recent Comments