భారత్ సమాచార్.నెట్: 2023-24 ఆర్థిక సంవత్సరంలో జాతీయ పార్టీలు (National Parties) పొందిన విరాళాల (Donations) జాబితాను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) వెల్లడించింది. ఈ మేరకు జాతీయ పార్టీలు పొందిన విరాళాల వివరాలను ఏడీఆర్ విడుదల చేసింది. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ (BJP) పార్టీకే అత్యధిక విరాళాలు అందినట్లు ఏడీఆర్ నివేదికలో వెల్లడైంది. కాషాయ పార్టీకి మొత్తంరూ.2,243 కోట్లు సమకూరినట్లు పేర్కొంది.
ఇక అన్ని పార్టీలకు వచ్చిన విరాళాల మొత్తం రూ.2,544.28 కోట్లుగా ఉంది. గత ఏడాది ఈ సంఖ్య 12,547 కోట్లుగా ఉంది. 2022-2023 ఆర్థిక ఏడాదితో పోలిస్తే 2023-24లో జాతీయ పార్టీలకు 199 శాతం విరాళాలు పెరిగినట్లు ఏడీఆర్ నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది వచ్చిన మొత్తం విరాళాల్లో ఒక్క కమలం పార్టీయే 88 శాతం దక్కించుకుంది. విరాళాల పరంగా 211 శాతం వృద్ధి నమోదైంది. కాగా నిబంధనల ప్రకారం.. రూ. 20వేలకు మించి విరాళాల వివరాలను రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘానికి తెలియజేయాల్సి ఉంటుంది.
ఇక బీజేపీ (BJP) తర్వాత అత్యధిక విరాళాలు అందుకున్న పార్టీగా మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ (Congress) నిలిచింది. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), సీపీఎం (CPM), నేషనల్ పీపుల్స్ (National Peoples Party) లాంటి పార్టీలకు తక్కువగా విరాళాలు వచ్చాయి. బహుజన్ సమాజ్ పార్టీ (BSP) మాత్రం గతంలో మాదిరిగానే ఈసారి కూడా తమకు ఒక్క రూపాయి విరాళం కూడా అందలేదని ప్రకటించింది. ఇదిలాఉంటే 2022-23 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి రూ. 719.858 కోట్ల విరాళాలు రాగా.. కాంగ్రెస్‌కు రూ. 79.924 లభించింది.