భారత్ సమాచార్.నెట్, కరీంనగర్: తెలంగాణ (Telangana)లోని రేవంత్ సర్కార్ (Revanth Govt) పర్యాటక రంగం (Tourism)పై దృష్టి సారించింది. అందుకు ప్రత్యేకంగా టూరిజం పాలసీని కూడా తీసుకొస్తోంది. టూరిజం ద్వారా ఆదాయం సమకూర్చుకునేందుకు రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, చారిత్రక కట్టడాలు, కోటలు, ఖిల్లాలు, చెరువులను అభివృద్ధి చేస్తోంది. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా రాష్ట్రంలో తొలిసారిగా రోప్ వే (Ropeway) ఏర్పాటు చేయనుంది.
పెద్దపల్లి జిల్లా (Peddapalli) మంథని నియోజకవర్గంలోని రామగిరి ఖిల్లా (Ramagiri Fort)ను అభివృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి. ప్రకృతి అందాలకు, అద్భుత శిల్పకళకు నెలవైన రామగిరి ఖిల్లాను జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చొరవతో ఖిల్లా చుట్టూ రోడ్ల నిర్మాణానికి రూ.5 కోట్లు కేటాయించారు. కాగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు కార్యరూపం దాలిస్తే రామగిరితోపాటు మంథని, ముత్తారం, కాల్వ శ్రీరాంపూర్ మండలాలు పర్యాటకంగా అభివృద్ధి చెందడంతో పాటు.. రవాణా, టూరిజం బిజినెస్‌లు అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
అయితే రామగిరి దగ్గరలో స్టేట్, నేషనల్ హైవేలు కూడా రాబోతున్నాయి. రామగిరి, ముత్తారం మీదుగా వరంగల్‌కు ఎన్‌హెచ్ 63 రోడ్డు వేస్తున్నారు. అలాగే, పెద్దపల్లి నుంచి కునారం మీదుగా ముత్తారం నుంచి భూపాలపల్లికి మరో స్టేట్ హైవే రానుంది. పీఎం సడక్ యోజన కింద అమ్రాబాద్ నుంచి ముత్తారం మండలం పారుపల్లి వరకు రోడ్డు నిర్మాణం మొదలైంది. ఈ రోడ్డులో ముత్తారం మండలంలో రెండు బ్రిడ్జిలు కడుతున్నారు. ఒక్కో బ్రిడ్జికి రూ.2.50 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ రహదారులు అన్నీ రామగిరి ఖిల్లా సమీపంలో ఉన్నాయి. అందువల్ల, రోడ్లతో పాటు రోప్ వే ఏర్పాటు కూడా పర్వతమాల ప్రాజెక్టు కింద చేపట్టాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్ర మంత్రి గడ్కరికి విజ్ఞప్తి చేశారు.