భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: మీకు వెహికల్ (Vechicle) ఉందా? ఉంటే అది పాతదా? లేదా కొత్తదా? ఒకవేళ ఆ వాహనం పాతది (Old Vechicle) అయితే ఈ వార్త మీకోసమే. 2019 ఏప్రిల్ 1వ తేదీ కన్నా ముందు తయారైన వాహనాలను ఉపయోగిస్తే.. వెంటనే వెళ్లి నంబర్ ప్లేట్ (Number Plate) మార్చుకోండి. పై తేదీ కన్నా ముందు తయారైన వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (HSRP) తప్పనిసరిగా అమర్చుకోవాల్సిందేనని తెలంగాణ రవాణా శాఖ (Telangana Transport Department) స్పష్టం చేసింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది రాష్ట్ర రవాణాశాఖ.
కొత్తగా హెచ్‌ఎస్‌ఆర్‌పీ నంబర్ ప్లేట్ మార్చుకునేందుకు సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది రాష్ట్ర రవాణాశాఖ. ఆ గడువులోపు నంబర్ ప్లేట్ మార్చుకోకపోతే వాహనాలను అమ్మాలన్నీ, కొనాలన్నా సాధ్యం కాదని తెలిపింది. అలాగే బీమా, పొల్యూషన్ సర్టిఫికేట్ లాంటివి కూడా లభించవని పేర్కొన్నారు. అన్ని సేవలు క్లోజ్ చేయటంతో పాటు కేసులు కూడా బుక్ చేయనున్నట్లు రావాణాశాఖ స్పష్టం చేసింది. నకిలీ నంబర్ ప్లేట్లను నిరోధించడం, వాహనాల దొంగతనాలను అరికట్టడం, రహదారి భద్రతను మెరుగుపరచడం వంటి లక్ష్యాలతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రవాణా శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వాహనం యొక్క రకాన్ని బట్టి హెచ్‌ఎస్‌ఆర్‌పీ నంబర్ ప్లేట్ యొక్క ధరలు కనిష్టంగా రూ. 320 నుండి గరిష్టంగా రూ. 800 వరకు ఉంటాయని రవాణా శాఖ అధికారులు తెలిపారు. పాత వాహనాలకు కొత్త నంబర్ ప్లేట్ ఏర్పాటు చేయించుకోవలసిన పూర్తి బాధ్యత వాహన యజమానిదే అని రవాణా శాఖ స్పష్టం చేసింది. ఇకపోతే 2019 ఏప్రిల్ 1వ తేదీ తర్వాత తయారైన వాహనాలకు ఇప్పటికే హెచ్ఎస్ఆర్‌పీ నంబర్ ప్లేట్ నిబంధన అమల్లో ఉంది. ఇప్పుడు పాత వాహనాలకు కూడా దీనిని తప్పనిసరి చేశారు.