భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిది. నాడు ఉవ్వెత్తున ఎగిసిపడ్డ ఉద్యమంలో జర్నలిస్టులు సబ్బండ వర్గాలను ఏకం చేసి రణనినాదమై రోడ్లపై గర్జించారు, పోలీసుల లాఠీ తూటాలకు వెనక్కుతగ్గలేదు, బెదిరింపులకు కేసులకు లొంగలేదు. ఆశ, ఆశయం, శ్వాస, ధ్యాస అన్ని తెలంగాణ రాష్ట్రం కోసమే జర్నలిస్టులు ధారపోశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర మరిచిపోలేనిది, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడేందుకు జర్నలిస్టులు చూపిన తెగువకు ప్రపంచమే నీరాజనం పలికింది. అణిచివేతకు గురైన తెలంగాణ ప్రజల జీవన స్థితిగతులను ప్రపంచానికి చూపిన ఘనత తెలంగాణ జర్నలిస్టులదే.
జర్నలిస్టులను ఉద్యమకారులుగా గుర్తించాలి:
తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర చారిత్రాత్మకమైనది, ‘తెలంగాణ కోసం తెలంగాణ జర్నలిస్టులు’ నినాదంతో రాష్ట్ర సాధనలో అన్నివర్గాల ప్రజలను జర్నలిస్టులు సమన్వయం చేసి మీడియా ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్లిన ఘనత తెలంగాణ జర్నలిస్టులది. నాడు తెలంగాణ కోసం జర్నలిస్టులు పోరు చేస్తే నేడు జర్నలిస్టులకు తెలంగాణ ఉద్యమకారులు అండగా నిలబడ్డారు. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ జర్నలిస్టులను ఉద్యమకారులుగా గుర్తించాలనే ప్రతిపాదన న్యాయమైందని ఆలోచించి తెలంగాణ జర్నలిస్ట్ ఫ్రంట్ ఆధ్వర్యంలో 16 జర్నలిస్టు సంఘాల భాగస్వామ్యంతో తెలంగాణ జర్నలిస్టుల సమ్మేళనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏప్రిల్ 13 (ఆదివారం) ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించే తెలంగాణ జర్నలిస్టుల సమ్మేళనానికి విచ్చేసి మీ అమూల్యమైన సందేశాన్ని అందించి ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, డెస్క్, ఫోటో, వీడియో జర్నలిస్టులకు దిశానిర్దేశం చేయాలని మనవి.