భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణ (Telangana)లో నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ (SC Classification) అమల్లోకి వచ్చింది. ఎస్సీ వర్గీకరణ జీవో (GO)ను న్యాయ శాఖ తాజాగా విడుదల చేసింది. ఏప్రిల్ 8న ఎస్సీ వర్గీకరణ బిల్లును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu Dev Varma) ఆమోదించగా.. నేడు ఎస్సీ వర్గీకరణపై గెజిట్ నోటిఫికేషన్ (Gazette notification) విడుదలైంది. ఇక ఈ పరిణామంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఉప కులాలకు 15 శాతం రిజర్వేషన్లు అధికారికంగా అమల్లోకి రానున్నాయి.
మొత్తం 56 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా విభజించారు. ఏ గ్రూప్‌లో 15 ఉప కులాలు ఉండగా.. వారికి 1 శాతం రిజర్వేషన్లు, బీ గ్రూప్‌లో ఉన్న 18 కులాలకు 9 శాతం, సీ గ్రూప్‌లో ఉన్న 26 కులాలకు 5 శాతం రిజర్వేషన్లు వర్తించనున్నట్లు పేర్కొంది. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ఈ గెజిట్ నోటిఫికేషన్‌ను అందుబాటులో ఉంచింది ప్రభుత్వం. కాగా సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణను దేశంలోనే అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. గతేడాది ఆగస్టు 1న ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వగా.. అదే రోజు వర్గీకరణను అమలు చేస్తామని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ 199 పేజీల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. ఇందులో 59 కులాల గురించి వివరంగా తెలిపింది. 2024 నవంబర్ 11న బాధ్యతలు చేపట్టిన కమిషన్ 82 రోజుల వ్యవధిలో ప్రభుత్వానికి నివేదిక అందజేసిన సంగతి తెలిసిందే. కమిషన్ పర్యనల్లో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో పాటు ఆఫిస్‌కు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ల్లో ప్రజల నుంచి వినతులను పరిశీలించిన కమీషన్.. 59 ఉపకులాలను మూడు గ్రూపులుగా వర్గీకరించింది. ఇందులో సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అత్యంత వెనుకబడిన కులాలను గ్రూప్ 1గా.. మధ్యస్త లభ్దిపొందని కులాలను గ్రూప్ 2గా, మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలను గ్రూప్ 3లో చేర్చింది.