భారత్ సమాచార్.నెట్, అయోధ్య: అయోధ్య (Ayodhya)లోని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ (Shri Ram Janmbhoomi Teerth Kshetra Trust)కు అనుమానాస్పద మెయిల్ వచ్చింది. ఈ మెయిల్ (Mail)లో రామాలయ భద్రత (Security) గురించి ట్రస్ట్‌కు హెచ్చరికలు ఉన్నాయి. దీంతో అప్రమత్తమైన ట్రస్ట్ మెయిల్‌పై దర్యాప్తు ప్రారంభించింది. ట్రస్ట్‌తో పాటు భద్రతా సంస్థలు, జిల్లా పోలీసు పరిపాలన బృందం కూడా రంగంలోకి దిగాయి. ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపించారు? అనే కోణాల్లో అధికారులు విస్తృతంగా దర్యాప్తు చేపట్టారు.
ఉగ్రవాద ముప్పు దృష్ట్యా ఇప్పటికే అయోధ్యలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రామాలయ పరిసర ప్రాంతాల్లో అత్యాధునిక భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు, ఆలయం చుట్టూ అనేక భద్రతా పాయింట్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మొత్తం ప్రాంతాన్ని డ్రోన్ నిఘాలోకి తీసుకొచ్చారు. ఎలాంటి అనుమానాస్పద కదలికలైనా వెంటనే గుర్తించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఇక తాజాగా బెదిరింపు రావడంతో భద్రతా ఏర్పాట్లను మరింత కఠినం చేశారు. అయితే ప్రాథిమికి దర్యాప్తులో తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి ఈ మెయిల్ పంపినట్లు గుర్తించారు.
అయితే అయోధ్య రామాలయాన్ని పేల్చివేస్తామని బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ అనేక బెదిరింపులు వచ్చాయి. 2024 సెప్టెంబర్‌లో రామాలయంపై బాంబు దాడి చేస్తామనే బెదిరింపు మెయిల్ వచ్చింది. అప్పట్లోనూ ఇదే తరహాలో భద్రతా వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. మరోవైపు అయోధ్య భద్రతపై రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా మాట్లాడుతూ.. ఆలయ భద్రత కోసం దాదాపు 4 కిలోమీటర్ల పొడవున్న భద్రతా గోడ నిర్మాణం ప్రారంభించినట్లు తెలిపారు. ఈ గోడ నిర్మాణాన్ని ఇంజినీర్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థ నిర్వహిస్తోంది. ఈ గోడ నిర్మాణం 18 నెలల్లో పూర్తి కానుందని ఆయన వెల్లడించారు.