భారత్ సమాచార్.నెట్: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన హైదరాబాద్(Hyderabad)లోని కంచ గచ్చిబౌలి (Gachibowli) భూముల వ్యవహారంపై తొలిసారిగా ప్రధాని మోదీ (Pm Modi) స్పందించారు. హర్యానా (Haryana)లోని యమునా నగర్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ప్రధాని మోదీ.. తెలంగాణ ప్రభుత్వంపై (Telangana Govt) తీవ్ర విమర్శలు గుప్పించారు. కంచ గచ్చిబౌలి భూముల్లోని అడవులపై కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్లు పంపడంలో నిమగ్నమై ఉందని విమర్శించారు. ప్రకృతి విధ్వంసం, వన్యప్రాణులకు హాని కలిగించడం కాంగ్రెస్ పాలనలో సాధారణ విషయమని మండిపడ్డారు.
ఓవైపు కేంద్ర ప్రభుత్వం పర్యావరణాన్ని కాపాడేందుకు కృషి చేస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం అటవీ సంపదను నాశనం చేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తుందన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు మోసపోతున్నారని అన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో అభివృద్ధి కుంటుపడిందన్నారు. కర్ణాటకలో విద్యుత్ నుంచి పాల వరకు అన్ని ధరలు పెరుగుతున్నాయన్నారు. కర్ణాటకను కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో నెంబర్ వన్ చేసిందన్నారు.
ఇకపోతే ఇటీవల HCUలో కంచ గచ్చిబౌలి భూముల అంశం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. 400 ఎకరాలను రేవంత్ సర్కార్ అమ్మకానికి పెట్టడంతో విద్యార్థులు ఆందోళనలకు దిగారు. విపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు కూడా వీళ్లకు మద్దతు ఇవ్వడంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టుకు ఈ అంశం చేరగా.. ఎలాంటి పనులు చేపట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ వివాదంపై ప్రధాని స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది.