భారత్ సమాచార్.నెట్: వక్ఫ్ బిల్లు (Waqf Bill)తో సంబంధించి కేంద్ర ప్రభుత్వం (Central Govt) యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు (Supremecourt) ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా (Sanjiv Khanna) నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును గురువారం విచారించింది. విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ప్రధాన న్యాయవాది (అటార్నీ జనరల్) పూర్తి వివరణాత్మక నివేదికను సమర్పించేందుకు ఒక వారం గడువు కోరగా.. న్యాయస్థానం అందుకు అంగీకరించింది. తదుపరి విచారణ వరకు వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై (Denotify) చేయబోమని కేంద్రం తెలిపింది.
అయితే తదుపరి విచారణ వరకు బిల్లులో ఎటువంటి మార్పులు చేయకూడదని, చట్టపరమైన ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాక, వక్ఫ్ చట్టానికి సంబంధించి ప్రస్తుత స్థితిని (స్టేటస్ కో) కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు మే 5కు వాయిదా వేసింది. ఇక కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈ బిల్లులో అనేక సవరణలు ఉన్నాయని, పలు కమిటీలను ఏర్పాటు చేసిన విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపారు. లక్షలాది అభ్యర్థనలు కూడా వచ్చాయని చెప్పారు.
గ్రామాలన్నీ వక్ఫ్ ఆస్తులుగా గుర్తించబడటంతో పాటు, వ్యక్తిగత ఆస్తులను కూడా వక్ఫ్ పరిధిలోకి తీసుకున్నారని వివరించారు. ఈ పరిణామాలు ప్రజలపై ప్రభావం చూపే అవకాశం ఉందని.. ఇటువంటి స్థితిలో నేరుగాగానీ, పరోక్షంగాగానీ స్టే ఇవ్వడం కఠినమైన అంశమని తుషార్ మెహతా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆధారాలు సమర్పించేందుకు వారం రోజుల పాటు గడువు ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు. బిల్లులో ఐదేళ్ల వరకు ప్రోవిజెన్స్ ఉన్నాయని తమకు తెలుసని.. వాటిని నిలిపివేయడం తమ ఉద్దేశం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ.. ఎలాంటి నియామకాలు చేపట్ట కూడదని ఆదేశాలు ఇచ్చింది. ఇక ఇవే పిటిషన్లపై సుప్రీంకోర్టులో బుధవారం కూడా వాదనలు జరిగిన సంగతి తెలిసిందే.