భారత్ సమాచార.నెట్: కోలీవుడ్ (Kollywood) స్టార్ హీరో (Star Hero) అజిత్ (Ajith Kumar)కు పెను ప్రమాదం తప్పింది. తాజాగా బెల్జియంలో జరిగిన యూరోపియన్ కార్ (European car race) రేసులో పాల్గొన్నారు నటుడు అజిత్. అయితే ఈ రేసులో అజిత్ కారు నియంత్రణ కోల్పోయి ట్రాక్ నుంచి పక్కకు దూసుకెళ్లింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదం నుంచి అజిత్ క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదం నుంచి అజిత్ తప్పించుకోవడంతో ఆయన ఫ్యాన్స్ అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అజిత్ కుమార్ 180 కి.మీ వేగంతో రేసు కోసం ప్రాక్టీస్ చేస్తుండగా.. అతని కారు ఒక డివైడర్‌ను ఢీకొని వెనక్కి తిరిగింది. దీని వల్ల ఆయన ప్రమాదానికి గురైనట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో కనిపిస్తోంది. కారు ముందు, వెనుక భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే శిక్షణ సమయంలో ఇలాంటి ప్రమాదాలు జరగడం సాధారణమేనని అజిత్ చెప్పినట్లు తెలుస్తోంది. కాగా అజిత్ కుమార్ విదేశాల్లో వివిధ కార్ రేసింగ్ పోటీల్లో పాల్గొంటారన్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే గతంలో కూడా అజిత్ కారు పలు మార్లు రేసింగ్ ట్రాక్ పై ప్రమాదానికి గురైంది. అజిత్‌కు ఇలా జరగడం మూడోసారి. అంతకముందు దుబాయ్‌లో జరిగిన గ్రాండ్ ప్రీ రేస్ కోసం ప్రాక్టీస్ చేస్తుండగా.. అజిత్ కారు గోడను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కూడా అదృష్టవశాత్తు అజిత్ సురక్షితంగా బయటపడ్డారు. ఆ తర్వాత స్పెయిన్‌లో జరిగిన మరో రేస్‌లో పక్కనే వస్తున్న మరో కారును తప్పించబోయి పల్టీలు కొట్టింది.