భారత్ సమాచార్.నెట్: భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) మరోసారి విదేశీ పర్యటన (Foreign Tour)కు వెళ్లనున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం సౌదీ అరేబియా (Saudi Arabia)కు ప్రధాని మోదీ వెళ్లనున్నారు. ఇటీవల సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ (Mohammed Bin Salman) ప్రధాని మోదీని కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తమ దేశంలో పర్యటించాలని ప్రధాని మోదీకి ఆహ్వానం పలికారు మొహమ్మద్. దీంతో ప్రధాని మోదీ సౌదీ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
ఈ నెల అంటే ఏప్రిల్ 22 నుంచి 23 తేదీల మధ్య సౌదీ పర్యటనకు బయలుదేరనున్నారు ప్రధాని మోదీ. ఈ పర్యటనలో భారత్-సౌదీ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు, ఇంధన భద్రత, రక్షణ సహకారం, అలాగే ద్వైపాక్షిక సహకారంపై సమగ్ర చర్చలు జరగనున్నట్లు సమాచారం. ముఖ్యంగా, ఇరుదేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా బలోపేతం చేయడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ పర్యటన కంటే ముందుగా 2016, 2019 సంవత్సరాల్లో ప్రధాని మోదీ సౌదీ అరేబియాను సందర్శించారు. అయితే 2024 డిసెంబర్లో ప్రధాని మోదీ సౌదీకి వెళ్లాల్సి ఉండగా.. ఆ షెడ్యూల్ పలు కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా మరో షెడ్యూల్ ఖరారు కావడంతో ఏప్రిల్లో సౌదీకి వెళ్తారు ప్రధాని. ఇక ఈ పర్యటన ముఖ్యంగా ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ (IMEC) వంటి ప్రాజెక్టుల ప్రగతిపై కీలక చర్చలకు వేదిక కానుందని సమాచారం. ఈ సందర్శన ద్వారా భారత్, సౌదీ అరేబియా మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.