భారత్ సమాచార్.నెట్: భారత్లో (India) పనిచేసే సామర్థ్యం ఉన్న.. జనాభా (Population) కన్నా ఉద్యోగ అవకాశాలు (Job Opportunities) వేగంగా పెరుగుతున్నాయని ప్రపంచ బ్యాంకు (World Bank) తాజా నివేదిక (Report) పేర్కొంది. గడిచిన ఆరేళ్లలో పట్టణ నిరుద్యోగం 6.6 శాతానికి దిగివచ్చిందని ప్రపంచ బ్యాంకు నివేదిక తెలిపింది. అలాగే గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఉద్యోగాల కోసం పట్టణాలకు వలసవస్తుండటంతో పురుషుల రేటు గణనీయంగా పెరిగిందని నివేదిక పేర్కొంది. ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు వ్యవసాయ రంగంలో అధికంగా శ్రమిస్తున్నారని పేర్కొంది
అయితే మహిళల ఉద్యోగాల్లో వృద్ధి ఉన్నప్పటికీ వేతనాల్లో లింగవివక్ష కొనసాగుతోందని తెలిపింది. అయితే ఉపాధి వృద్ధి ఉన్నా నిరుద్యోగ యువత రేటు పెరుగుతుండటంపై ప్రపంచ బ్యాంకు ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో నిరుద్యోగ యువత 13.3 శాతం ఉండగా.. ఉన్నత విద్య పూర్తి చేసిన వారిలో 29 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారని.. ఇంకా ఉద్యోగం కోసం వెతుకుతున్నారని ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొంది.
పేదరికం కాస్త తగ్గినప్పటికీ దేశంలోని ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలు ఇంకా అత్యంత పేద రాష్ట్రాలుగా ఉన్నాయని వివరించింది. ఉపాధి రంగంలో డైనమిక్స్ వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయని ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది. స్థిరమైన ఆర్థిక సంస్కరణలు, పెట్టుబడుల వృద్ధి ద్వారా మాత్రమే ఉపాధి రంగాన్ని మరింత బలోపేతం చేయచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు.