భారత్ సమాచార్.నెట్: పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack) నేపథ్యంలో భారత్ (India), పాక్ (Pakistan) మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం (Pm Modi Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. పొరుగు దేశం పాకిస్థాన్‌కు చెందిన 16 యూట్యూబ్ ఛానళ్ల (Youtube Channels)పై నిషేధం విధించింది. ఇప్పటికే వీసాలు రద్దు, సింధు జలాల ఒప్పందం నిలిపివేత, ఔషధాల ఎగుమతి, పాకిస్థాన్ నటుల సినిమాలు నిషేధం వంటి నిర్ణయాలు తీసుకున్న భారత్ తాజాగా ఈ ఛానళ్లపై వేటు వేసింది. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
దాదాపు 16 యూట్యూబ్ ఛానళ్లపై కేంద్ర ప్రభుత్వం వేటు వేసింది. భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వీడియోలు, మతపరమైన, సున్నితమైన కంటెంట్ వ్యాప్తి, భారత సైన్యం, భద్రతా సంస్థలను లక్ష్యంగా చేసుకొని తప్పుదోవ పట్టించే కథనాలను వ్యాప్తి చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కేంద్రం నిషేధం విధించిన ఛానళ్లలో పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ తోపాటు డాన్ న్యూస్, సమా టీవీ, ఆరీ న్యూస్, జియో న్యూస్, మునీబ్ ఫరూఖ్, ఉజైర్ క్రికెట్ వంటి ప్రముఖ మీడియా సంస్థలకు చెందిన యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయి.
ఆయా యూట్యూబ్‌లను యాక్సెస్ చేయగా.. ప్రభుత్వ ఆదేశాల మేరకు సమాచారాన్ని తొలగించినట్లు ఆయా ఛానళ్లలో సందేశం కనిపిస్తోంది. వీటితో పాటు ప్రముఖ వార్తా సంస్థ బీబీసీకి కూడా కేంద్రం నోటీసులు పంపింది. పాక్‌కు అనుకూలంగా వార్తలు ప్రసారం చేయడంతో నోటీసులు జారీ చేసింది. ఇకపోతే ఈ నెల 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపగా.. వారిలో 28 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడితో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే పొరుగు దేశంపై కఠినంగా వ్యవహరిస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది భారత్.