భారత్ సమాచార్.నెట్: వరుసగా ఐదు ఓటముల తర్వాత ఎట్టకేలకు రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals).. మూడో విజయాన్ని అందుకుంది. అది కూడా సంచలన విజయాన్ని నమోదు చేసింది. అందుకు కారణం 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi). అసలు 14 ఏళ్లకే ఐపీఎల్ (IPL)లో అరంగేట్రం చేసిన ఈ బీహార్ (Bihar) చిచ్చరపిడుగు.. క్రికెట్ ప్రపంచంలో సెన్సేషన్‌గా మారిపోయాడు. గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)తో జరిగిన మ్యాచులో బౌండరీలు, సిక్సర్లతో స్టేడియాన్ని దద్దరిల్లేలా చేసిన వైభవ్.. తన ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు.
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేశాడు వైభవ్. మ్యాచులో 11 సిక్సలు, 7 ఫోర్లు కొట్టగా.. మొత్తంగా 38 బంతుల్లో 101 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా వైభవ్ చరిత్రకెక్కాడు. వైభవ్ చేసిన ఈ అద్భుత ప్రదర్శన వల్లే గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తాజా మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేధనలో రాజస్థాన్ రాయల్స్ 15.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ఐపీఎల్లో శతకం బాదిన అతి పిన్న వయస్కుడి (14 ఏళ్ల 322 రోజులు)గా వైభవ్ రికార్డుకెక్కాడు. ఈ సీజన్లో సెంచరీ బాదిన తొలి ఇండియన్ బ్యాటర్ గానూ నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ ఇదే కావడం విశేషం. ఇక 14 ఏళ్ల కుర్రాడి బ్యాటింగ్‌కు యావత్ దేశం ఫిదా అయ్యింది. ప్రత్యర్థి ఆటగాళ్లు సైతం ఈ కుర్రాడికి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. తొలి మ్యాచ్‌లో ఔటై ఏడ్చిన ఈ 14 ఏళ్ల సిక్సర్ల పిడుగు.. మూడో మ్యాచ్‌లోనే బౌలర్లను తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఏడ్పించేశాడు.