భారత్ సమాచార్,రాజకీయం : గులాబీ బాస్ సీఎం కేసీఆర్ వాక్చాతుర్యం గురించి అందరికీ బాగా తెలిసిందే. ఇప్పుడంటే కొంచెం ఆయన మాటల్లో వాడీవేడీ కొంత మేరకు తగ్గింది కానీ ఆయన పంచ్ లు, ప్రాసల కోసం ఆయన సభలకు జనం ఎగబడేవారు చాలా మందే ఉంటారు. వాస్తవానికి తెలంగాణ రావడానికి కారణమైన దానిలో ‘కేసీఆర్ మాట’ కూడా ఒక అంశం అనడంలో పెద్ద అతిశయోక్తి ఏం కాదు. ప్రస్తుతం ఆయన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా అయిపోయారు. రోజుకూ రెండు, మూడు మీటింగుల్లో పాల్గొంటున్నారు. రాష్ట్రంలోని ఏమూలకు వెళ్లినా..అక్కడి సమస్యలు, సాదకబాధకాలు, అక్కడి అవసరాలు తెలిసిన నేత బీఆర్ఎస్ అధినేత. అందుకే ఎక్కడికెళ్లినా సాధికారికంగా మాట్లాడడం కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు ఒక్కరికే చెల్లింది తెలంగాణలో.
తాజాగా శుక్రవారం హుజూరాబాద్ ప్రచార సభలో ఆయన పాల్గొన్ని మాట్లాడారు. అక్కడి అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డిని గెలిపించాలంటూ సభకు వచ్చిన జనాలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. హుజూరాబాద్ ప్రజలు తనకెంతో ప్రత్యేకమని, ఇక్కడే రైతుబంధు, దళితబంధు వంటి పథకాలను ప్రారంభించానని స్థానికులకు గుర్తు చేశారు. కానీ ఇక్కడి ప్రజలు గత ఉప ఎన్నికలో తనను ఎంతో బాధపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. హుజూరాబాద్ కు తాను ఎంతో చేశానని.. అయినా తనను కాకుండా ఎవరినో ఎత్తుకోవాల్సిన అవసరమొచ్చిందని అక్కడి ప్రజలను ప్రశ్నించారు. మరోసారి అలా బాధపెట్టవద్దని మరీ మరా కోరారు.
స్థానిక ఎమ్మెల్యే హుజూరాబాద్ కు చేసిన అభివృద్ధి ఏమీ లేదని పరోక్షంగా ఈటల రాజేందర్ ను పెద్ద ఎత్తున విమర్శించారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ఈటల రాజేందర్ టీఆర్ఎస్ లోకి, ఉద్యమంలోకి రాకముందే.. పాడి కౌశిక్ రెడ్డి తండ్రి గులాబీ జెండాను మోశారని గుర్తు చేశారు. కౌశిక్ తనకు కొడుకులాంటివాడని, అతడిని గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను, ఓటర్లను కోరారు. గెలిపించటం అంటే గెలవటం ఒక్కటే కాదు భారీ మెజార్టీతో పాడి కౌశిక్ ను తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి పంపాలని ఓటర్లకు సూచించారు.