Homebreaking updates newsగ్రూప్-2 పోస్టులు పెంచుతం.. కేటీఆర్

గ్రూప్-2 పోస్టులు పెంచుతం.. కేటీఆర్

భారత్ సమాచార్, రాజకీయం : వచ్చే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే గ్రూప్-2 పోస్టులు పెంచడంతో పాటు ఉద్యోగాల భర్తీని కూడా చాలా వేగవంతం చేస్తామని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేడు నిరుద్యోగులకు భరోసా కల్పించారు. సోమవారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని అశోక్ నగర్ తో పాటు వివిధ యూనివర్సిటీల్లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఉద్యోగార్థులతో ఆయన రెండు గంటలపాటు ఎన్నికల ప్రచారంలో భాగంగా చర్చించి వారి సమస్యలను నోట్ చేసుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తెల్లారే (డిసెంబర్ 4) అశోక్ నగర్ లో నిరుద్యోగులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తానన్నారు. వారితో వేగవంతంగా ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగుల సమస్యలు వంటి అన్ని అంశాలపై చర్చిస్తామని కేటీఆర్ వెల్లడించారు. తాము అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, నిరుద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా విధాన నిర్ణయాలను వేగంగా తీసుకుంటామన్నారు. ప్రస్తుతం కొనసాగిస్తున్న ఉద్యోగ నియామక ప్రక్రియను మరింత వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. యువతకు లక్ష ఉద్యోగాలు ఇస్తామని తాము హామీ ఇచ్చామని, అంతకంటే ఎక్కువే భర్తీ చేయటానికి ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చారు.

దశాబ్దకాలం పాటు ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసిన అనుభవం తనకు ఉందని, ఉద్యోగ సాధనలో, సాధించాక కూడా ఎన్నో సవాళ్లు ఉంటాయని, అవన్నీ తనకు తెలుసని, మీ సోదరుడిగా మీ సమస్యలను అన్నింటినీ అర్థం చేసుకొని పరిష్కరిస్తామని భరోసా ఇస్తున్నానని మాట ఇచ్చారు. అంతకుముందు పోస్టుల భర్తీ ప్రక్రియ, రోస్టర్ పాయింట్ల కేటాయింపు, విద్యార్హతల విషయంలో కొన్ని సమస్యలను సులువుగా పరిష్కరించే అవకాశం ఉందంటూ నిరుద్యోగులు కేటీఆర్ దృష్టికి తెచ్చారు. నిరుద్యోగుల సలహాలు, సూచనలను పూర్తి సానుకూల దృక్పథంతో పరిశీలిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. నిరుద్యోగుల కోరిక మేరకు గ్రూప్-2 పోస్టుల సంఖ్యను పెంచుతామని కూడా చెప్పారు. ఉద్యోగ అభ్యర్థులకు నిరుద్యోగ భత్యం, స్టడీ సెంటర్లు కల్పించే అవకాశాలను పరిశీలిస్తామని హామి ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments