Homebreaking updates news80 సీట్లు రాకుంటే ఏ శిక్షకైనా సిద్ధమే.. రేవంత్ రెడ్డి

80 సీట్లు రాకుంటే ఏ శిక్షకైనా సిద్ధమే.. రేవంత్ రెడ్డి

భారత్ సమాచార్, రాజకీయం: తెలంగాణలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకీ 80 సీట్లు రాకుంటే, తనకు ఏ శిక్ష విధించిన సిద్ధమేనని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పదవి పోతుందనే భయం పట్టుకుందని, అందుకే కాంగ్రెస్ కు 20 సీట్లు రావని మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తున్నారని ఎన్నికల ప్రచారంలో ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన నిజామాబాద్, గజ్వేల్, నారాయణఖేడ్, కూకట్ పల్లి విజయభేరి సభలు, రోడ్ షోల్లో పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..డిసెంబర్ 9 నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం పాలన రాబోతుందని జోస్యం చెప్పారు. ఆ రోజే ప్రగతి భవన్ పేరును ‘బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాపాలన భవన్’ గా మారుస్తామని ప్రకటించారు. ప్రజలు, ఉద్యోగులు అందరూ వచ్చి తమ సమస్యలను విన్నవించుకునేందుకు 24 గంటలూ సెక్రటేరియట్ తలుపులు తెరిచే ఉంటాయన్నారు.

నిజామాబాద్ ప్రజలు కవితను ఓడించినందుకు కేసీఆర్ కక్షగట్టి ఆ ప్రాంతాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. కేసీఆర్ లక్ష కోట్లుదిగ మింగారని, 10వేల ఎకరాల భూమిని ఆక్రమించారని.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత .. ఆ ప్రజా సొమ్మంతా వసూలు చేస్తామని చెప్పారు. గజ్వేల్ ప్రజలు కేసీఆర్ ను ఓడించి ఇంటికి సాగనంపాలని కోరారు. రైతులు పండించిన ధాన్యాన్ని తరుగు పేరుతో కొనక మిల్లర్లు సతాయిస్తుంటే.. కేసీఆర్ ఫాంహౌస్ వడ్లకు మాత్రం క్వింటాకు రూ.4,250 చెల్లించి కొంటున్నాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలను అమలుచేస్తామని చెప్పారు. బీసీ కులాల నుంచి తొలగించిన 26 కులాలను మళ్లీ అందులో చేరుస్తామని భరోసా ఇచ్చారు. ఆరు గ్యారంటీలతోనే రాష్ట్రంలో సంక్షేమం, ప్రజా పరిపాలనా సక్రమంగా సాగుతుందని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి లబ్దిదారుడికి సంక్షేమ పథకాలు అందిస్తామని హామి ఇచ్చారు. ఆరు గ్యారంటీలను రాష్ట్రంలోని ప్రతి కుటుంబం కూడా లబ్ది పొందేలా రూపొందించినట్టు తెలిపారు. ఆరు గ్యారంటీల గురించి ఓటర్లకు వివరించటంతో పాటుగా  అధికార పార్టీపై విమర్శల బాణాలు కూడా ఎక్కుపెట్టారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments