భారత్ సమాచార్, రాజకీయం : తెలంగాణ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ప్రముఖ రాజకీయ నాయకుల ప్రసంగాలు ప్రజలకు రక్తి కట్టిస్తున్నాయి. ప్రచార పర్వానికి ఇంకా 3 రోజులే ఉండడంతో ఒకరిని మించి మరొకరు ఇతరులపై దుమ్మెత్తిపోసుకుంటున్నారు. రోడ్ షోలు, బహిరంగ సభలు, ఇంటింటి ప్రచారం, సోషల్ మీడియా, ప్రధాన మీడియా వేదికగా ప్రచారం సాగిస్తూ, పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేసుకుంటున్నారు. అన్ని తెలుగు, ఆంగ్ల ప్రధాన పత్రికల్లో పేజీలకు పేజీలు పొలిటికల్ యాడ్సే మాత్రమే కనపడుతున్నాయి. ఇక యూట్యూబ్ లో ఏ వీడియో ఓపెన్ చేసనా సరే పొలిటికల్ యాడ్సే మరి.. అఖరికి షార్ట్స్ లో కూడా ఎలక్షన్ యాడ్సే కనపడుతున్నాయి. మొన్నటిదాక ప్రచారమంతా కరెంట్ మీద నడిచినా.. గత ఐదారు రోజులుగా జాబ్ నోటిఫికేషన్లు, నిరుద్యోగుల బాధలపైనే ప్రస్తుతం నాయకుల సవాళ్లు, విమర్శలు సాగుతున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శనివారం ఓ పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు.. 55 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ యువతను మోసం చేసింది నిజం కాదా అని అందులో ప్రశ్నించారు. యువతను రెచ్చగొట్టి చిచ్చు పెట్టాలని చూస్తున్న రాజకీయ నిరుద్యోగి రాహుల్ అంటూ విమర్శలు గుప్పించారు. ‘‘మీరు ప్రకటించిన పసలేని జాబ్ క్యాలెండర్ పచ్చి మోసం అని ఎద్దేవా చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే.. 2024 ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉద్యోగాలు ఎలా సాధ్యమంటూ? రాహుల్ ని నిలదీశారు. యువతను మభ్యపెట్టి నాలుగు ఓట్లు సంపాదించటం కోసమే ఈ నాటకమంతా అని ఆరోపించారు. రాహుల్ గాంధీ.. జీవితంలో ఎప్పుడైనా ఉద్యమం చేశారా? కనీసం ఉద్యోగం అన్నా చేశారా? అరె ఒక్క సారి అన్నా పోటీ పరీక్షైనా రాశారా, సన్నద్ధం అయ్యార ? ఇంటర్వ్యూకు వెళ్లారా ? ఉద్యోగార్థుల ఇబ్బందులు మీకెలా తెలుస్తాయి, అర్థమవుతాయి.. అంటూ విమర్శనాస్త్రాలు రాహుల్ గాంధీ, ఆ పార్టీ నాయకులపై సంధించారు. మీరు నిరుద్యోగులకు ఒరగబెట్టిందేమీ లేదని, ఇప్పటికైనా తెలంగాణకు వచ్చి ప్రగాల్భాలు పలకటం చాలించాలని సూచించారు.