భారత్ సమాచార్,సినీ టాక్స్ : ‘‘పాలమ్మిన.. పూలమ్మిన.. కష్టపడ్డా.. పైకి వచ్చిన..’’ అంటూ సోషల్ మీడియాలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను ఏర్పరుచుకున్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి. డీజే టిల్లు సాంగ్ కు స్టెప్పులేసినా, మంచి ప్రాస డైలాగులో కడుపుబ్బా నవ్వించినా ఆయనకు మాత్రమే చెల్లింది. ఆయన ఉన్నాడంటే ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావాల్సిందే. ఆయన ఎన్నికల ప్రచారం కూడా అలాగే సాగుతోంది. ఆయన ఫన్నీ కామెంట్స్ తో ఎన్నికల ప్రచారంలోనూ జనాలు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
మల్లారెడ్డికి ఉన్న క్రేజ్ తో ఆయన కాలేజీ క్యాంపస్ లో సినిమా ఫంక్షన్లు చేసుకోవడానికి సినీ జనాలు క్యూ కడుతున్నారు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు సినిమాలతో పాటు హిందీ సినిమాలను కూడా ఇక్కడి నుంచి ప్రమోషన్ చేసుకోవడం మరో విశేషం. సినిమా ఫంక్షన్ బయట ఎక్కడో పెడితే జన సమీకరణ కష్టం. మల్లారెడ్డి కాలేజీల్లో వేలాది మంది యూత్ చదువుకుంటూ ఉంటారు. ఈ క్యాంపస్ లో సినిమా ఫంక్షన్ చేసుకుంటే చాలా ఈజీగా జనసమీకరణ చేయవచ్చు. యూత్ ను ఆకట్టుకోవచ్చు, సినిమా ప్రమోషన్స్ చేసుకుంటా మూవీ పై భారీ హైప్ ను క్రియేట్ చేసుకోవచ్చు. అందుకే మల్లారెడ్డి కాలేజీలో మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లు, ఆడియో లాంఛ్ లు చేయడానికి దర్శకనిర్మాతలు ముందుకువస్తున్నారు. సోమవారం రణబీర్ కపూర్, సందీప్ వంగా కాంబినేషన్ లో వస్తున్న ‘యానిమల్’ మూవీ ప్రీ రిలీజ్ వేడుక అక్కడ వైభవంగా జరిగింది. దీనికి రాజమౌళి, మహేష్ బాబు, రణబీర్, సందీప్, అనిల్ కపూర్, ఇతర ప్రముఖ బాలీవుడ్ నటులు హాజరయ్యారు.
ఈసందర్భంగా మల్లారెడ్డి తన ఫ్లోలో తాను మాట్లాడుతూ..‘‘మరో ఐదేళ్లలో హిందుస్థాన్, బాలీవుడ్, హాలీవుడ్ ను తెలుగు పీపుల్ రూల్ చేస్తారు. ముంబై పాతదైపోయింది. బెంగళూర్ లో ట్రాఫిక్ జాంలు..’ అంటూ కామెంట్స్ చేశారు. దీంతో బాలీవుడ్ నటుల ముందే వారి ఇండస్ట్రీని, వారి సిటీని కించపరుస్తారా? అంటూ బాలీవుడ్ ఫ్యాన్స్ తో పాటు ఇతర సినీ అభిమానులు, నెటిజన్లు మండిపడుతున్నారు.