భారత్ సమాచార్, రాజకీయం : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. రేపు (నవంబర్ 30) పోలింగ్ జరుగనుండగా మరో నాలుగు రోజుల్లో ఫలితం తేలనుంది. మూడో సారి అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్, కేసీఆర్ గద్దెదించాలని కాంగ్రెస్, చక్రం తిప్పేది తామే అంటూ బీజేపీ ఎన్నికల రణరంగంలోకి దిగాయి. గత రెండు నెలలుగా విపరీతంగా శ్రమించాయి. ప్రచార పర్వంలో భాగంగా రోడ్ షోలు, ఇంటింటి ప్రచారాలు, కాలనీ విజిట్లు, వర్గాల వారీ మీటింగ్ లు, బహిరంగ సభలు.. ఇలా ఎన్నో రకాల ఫిట్లను నేతలు చేసి చేసి అలసిపోయారు. ఇక పోలింగ్ కు ఒక్క రోజే ఉండడంతో అందరూ పోల్ మేనేజ్ మెంట్ లో మునిగిపోయారు.
గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి వందలాది సర్వేలు బయటకొచ్చాయి. సోషల్ మీడియా ప్రభావం తీవ్రంగా ఉండడంతో ఫేక్ సర్వేలు పెడుతూ.. ఆ పార్టీ గెలుస్తోందని, ఓ పార్టీ ఓడిపోతోందని.. ఇలా ఓటర్లను మభ్యపెడుతున్నాయి. ఓటరును తన అభిష్టానికి అనుగుణంగా ఓటు వేయనీయకుండా సర్వేలు అడ్డుకుంటున్నాయని విశ్లేషకులు వాపోతున్నారు. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాన్ని విద్యావంతులు, మేధావులు సైతం మోసపోతున్న విషయం మనకు తెలిసిందే. మరి స్మార్ట్ ఫోన్ వాడుతూ సోషల్ మీడియాపై అంతగా అవగాహన లేని వారు.. ఎంతో నష్టపోయే అవకాశం ఉంది. ఫేక్ సర్వేలు చేయడం కూడా పార్టీల అఖరి పోరాటంలో భాగమేనని అని కూడా విమర్శలు ఉన్నాయి. సోషల్ మీడియాను తెగ వాడుకునే కొన్ని పార్టీలు ఈ సర్వేలను తారుమారు చేసి తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయని అంటున్నారు.
వాస్తవానికి ఓటరు నాడీని పట్టే అవకాశాలు పెద్దగా ఉండవని, ఈ సర్వేలన్నీ జనాల మూడ్ ను కొద్ది శాతంలో తెలియజేస్తాయని, అంతే తప్ప నూటికి నూరు పాళ్లు నిజం కావని విశ్లేషకులు సూచిస్తున్నారు. గతంలో ఏ ఒక్కటో, రెండో సర్వేలు వచ్చేవి.. అవి రాష్ట్రమంతా కలియతిరిగి జనాల నాడీని పసిగట్టేవని, అవి ఎంతో కొంత నిజమయ్యేవి. కానీ నేటి సర్వేలను పార్టీలే చేయిస్తుండడంతో అవి వాటికి అనుకూలంగా ఉంటూ జనాలను తప్పుదారి పట్టిస్తున్నాయని వాపోతున్నారు. మొత్తానికి జనాలు ఈ సర్వేలు, ఫేక్ సర్వేలు కాకుండా తమ భవిష్యత్ కు ఎవరూ అండగా ఉంటారో, తమకు నిత్యం ఎవరూ అందుబాటులో ఉంటారో.. ఎవరూ ఉపాధి కల్పిస్తారో.. రాష్ట్రాభివృద్ధికి ఎవరూ తోడ్పడుతారో నిర్ణయించుకొని తమ మనోభిష్టం మేరకు ఓటు వేయాలని సూచిస్తున్నారు.