భారత్ సమాాచార్, రాజకీయం : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సజావుగా ముగిసింది. పోలింగ్ అయ్యిందో లేదో సర్వే ఏజెన్సీలు ఎగ్జిట్ పోల్స్ ను వెంటనే వెల్లడించాయి. ఎక్కువ శాతం సర్వేలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అంచనా వేయగా, మూడు, నాలుగు సర్వే ఏజెన్సీలు మాత్రం బీఆర్ఎస్ మూడో సారి హ్యాట్రిక్ కొడుతుందని వెల్లడించాయి. ఒకటో, రెండో సర్వే సంస్థలు హంగ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా పేర్కొన్నాయి. అయితే అన్నింటిని పరిగణలోకి తీసుకుని విశ్లేషిస్తే.. ఎన్నికల ఫలితాల సర్వేలో రెండు అంశాల్లో మాత్రం క్లారిటీ కనపడుతోంది.
ఒకటి… తెలంగాణలో హంగ్ రావడం, రెండోది ఉప్పు, నిప్పులాంటి బద్ధశత్రువులు బీజేపీ, ఎంఐఎం కలిసి 12-15 సీట్లు సంపాదించుకోవడం. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కీలక పాయింట్ గా కనిపిస్తోంది.
ఎక్కువ శాతం ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపే మొగ్గుచూపినా హంగ్ కు కూడా ఎక్కువే అవకాశాలు ఉన్నట్టు కొన్ని సర్వేలు ప్రకటించాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పక్కాగా అధికారంలోకి రావడానికి 70 సీట్ల దాక తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్, ఎంఐఎం అప్రకటిత దోస్తీ ఉంది కాబట్టి. సర్వే సంస్థలన్నీ కూడా బీఆర్ఎస్ కు కనీసం 40-45 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నాయి. ఈ సీట్లకు బీజేపీ, ఎంఐఎం సీట్లు కలిస్తే మాత్రం కాంగ్రెస్ వైపు బలం 60 సీట్ల లోపునకే పరిమితం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి వాటిని బేరీజు వేసుకొని చూస్తే వచ్చే ఫలితాలలో హంగ్ ఖాయమేననిపిస్తోంది.
హంగ్ వస్తే మాత్రం ఎంఐఎం పాత్ర చాలా కీలకం కానుంది. ఆ పార్టీ బీఆర్ఎస్ తో అనుబంధం బలంగానే కొనసాగుతోంది. అయితే ఎంఐఎం మనసు మార్చుకుని కాంగ్రెస్ వైపు వెళ్తే కాంగ్రెస్సే అధికారంలోకి రానుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ ఏనాడూ హంగ్ పరిస్థితి తలెత్తలేదని విశ్లేషకులు చెపుతున్నారు. ఒకవేళ అదే పరిస్థితి వస్తే కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉండనుంది. ప్రస్తుత పరిస్థితిని చూస్తే ఎంఐఎం, బీజేపీ.. బీఆర్ఎస్ తో జతకట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కాబట్టి ఏం జరుగుతుందో డిసెంబర్ 3 దాక ఆగాల్సిందే.