భారత్ సమాచార్, సినీ టాక్స్ : వారు వెండితెర సినీ తారలు. వారు స్టైల్ గా టీ తాగిన, సిగరేట్ తాగిన, హీరోలు, హీరోయిన్లు వెండితెరపై ఎలాంటి బట్టలు వేసుకున్న వాటి ప్రభావం దేశంలోని యువతపై చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా మంది యూత్ తమ హీరోను ఆరాధ్య దైవంగా కూడా భావిస్తుంటారు. ప్రతీ విషయంలోనూ వారిని అనుకరిస్తూ ఉంటారు. వారు చేసే ప్రతి పనిని తీక్షణంగా గమనిస్తూ ఉంటారు. వారు మంచి చేసినా, చెడు చేసినా.. కూడా వారిని ఫాలో అవుతూ తమ అభిమానాన్ని చాటుకుంటారు. సినిమా స్టార్లు తమకున్న క్రేజ్ వల్ల పలు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ కోట్ల రూపాయలను పారితోషికంగా తీసుకుంటారు. అయితే వీరిలో కొందరు యువతపై చెడు ప్రభావం చూపే గుట్కాలు, సిగరెట్లు, మద్యం ప్రకటనల్లో కూడా నటిస్తూ ఉంటారు. దీంతో యూత్ కూడా వారిని ఫాలో అవుతూ చెడు ఉత్పత్తులకు అలవాటై దాన్నే హీరోయిజం అనుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ప్రకటనపైనే కేంద్రం ముగ్గురు బాలీవుడ్ స్టార్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
గుట్కా సంబంధిత వాణిజ్య ప్రకటనల్లో పాల్గొన్నారంటూ కోర్టులో దాఖలైన పిటిషన్ పై ముగ్గురు బాలీవుడ్ అగ్రనటులు షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్ లకు కేంద్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. స్టార్ హీరోలు కొన్ని హానికారక ఉత్పత్తులకు సంబంధించిన యాడ్స్ లలో పాల్గొనడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మోతీలాల్ యాదవ్ అనే న్యాయవాది గతంలో అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భారత ప్రభుత్వం నుంచి గౌరవప్రదమైన పురస్కారాలు అందుకున్న వారు ఇలాంటి ప్రకటనల్లో పాల్గొనడం సరికాదని ఆ పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. దీనిపై విచారించిన న్యాయస్థానం.. పిటిషనర్ అభ్యంతరాలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం అక్టోబర్ 22న షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎస్ బీ పాండే తాజాగా తెలిపారు.