భారత్ సమాచార్, రాజకీయం : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం నుంచి షురువయ్యాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క 42 పేజీల శ్వేత పత్రాన్ని విడుదల చేసి శాసనసభ్యులకు అందించారు.
‘‘ప్రజలంతా అభివృద్ధి చెందాలని పోరాడి, ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణను సాధించుకున్నాం.. గత ప్రభుత్వం రాష్ట్ర వనరులను సక్రమంగా ఉపయోగించలేదు. రోజువారీ ఖర్చులకూ కూడా ఓడీ ద్వారా డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితిని క్రియేట్ చేసింది. ఇలాంటి ఆర్థిక దుస్థతి తెలంగాణ రాష్టానికి రావడం నేను దురదృష్టంగా భావిస్తున్నా. దశాబ్ద కాలంగా జరిగిన ఆర్థిక తప్పిదాలు ప్రజలకు కూడా కచ్చితంగా తెలియాలి. ఆర్థిక సవాళ్లను స్వీకరించి మేము బాధ్యతాయుతంగా అధిగమిస్తాం. ఆ దిశలో శ్వేతపత్రం మొదటి అడుగు’ అని భట్టి వివరించారు.
శ్వేతపత్రంలోని ప్రధాన అంశాలు…
- తెలంగాణ బడ్జెట్ కు వాస్తవ వ్యయానికి 20 శాతం అంతరం ఉంది.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమ బడ్జెట్ అంచనాలకు వాస్తవ వ్యయాల మధ్య భారీ తేడా ఉంది.
- 2014- 15 లో అప్పు రూ.72,658 కోట్లు.. ఉంటే ప్రస్తుతం రూ. 6, 71, 757 కోట్లకు అప్పు పెరిగింది. అంటే సగటున 24.5శాతం అప్పు పెరిగింది.
- పదేళ్లలో ఖర్చు చేసిన నిధులకు అనుగుణంగా ఆస్తులు సృష్టించబడలేదు.
- రుణాలకు వడ్డీ చెల్లింపుల భారం రెవెన్యూ రాబడిలో 34 శాతానికి పెరిగింది.
- రెవెన్యూ రాబడిలో మరో 35% ఉద్యోగుల జీతాలు పెన్షన్లకు వెళ్లింది.
దీంతో పేద వర్గాల సంక్షేమ కార్యక్రమాలకు ఆర్థిక వెసులుబాటు తగ్గింది. - 2014లో 100 రోజులకు సరిపడా బ్యాలెన్స్ ఉండేది. ప్రస్తుత పరిస్థితి పది రోజులకు తగ్గింది.
- విద్య వైద్య రంగాలకు సరైన నిధులు ఖర్చు చేయలేకపోయింది.
- రోజువారి ఖర్చులకు కూడా ఆర్బీఐ పై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది.
- 2014లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. బడ్జెటేతర రుణాలు పెరగడమే ఈ పరిస్థితికి కారణం.