భారత్ సమాచార్, రాజకీయం : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఒక్కరోజు కూడా తీరిక లేకుండా ఉన్నారు. శాఖలవారీగా ఉన్నత స్థాయి అధికారులతో సమీక్షలు, అధికారుల బదిలీలు, నియామకాలు, అసెంబ్లీ సమావేశాలు.. ఇలా రోజూ బిజీబిజీగా గడుపుతున్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలను సరిచేసే దిశగా తన వంతు ప్రయత్నం చేస్తున్నారు.
ఇంతటి బిజీ షెడ్యూల్ లో రేవంత్ రెడ్డి ఉన్నారు. ఈ క్రమంలో 5వ తరగతి చదువుతున్న ఓ బాలిక ఆయనకు లేఖ రాసింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చిన సంగతిని గుర్తుచేస్తూ ఆ లేఖ ను పంపింది. ఇందులోనే ఆ అమ్మాయి తన పుట్టిన రోజు సందర్భంగా గిఫ్ట్ గా ఓ కోరికను కూడా సీఎం రేవంత్ రెడ్డిని కోరింది.
లేఖలోని సారంశం ఏంటంటే..‘‘గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారికి నమస్కరించి వ్రాయునది.. ముఖ్యమంత్రిగా మీరు ఎన్నికైనందుకు నా శుభాకాంక్షలు. దయచేసి మా ప్రభుత్వ స్కూల్ కు ఉచిత విద్యుత్ అందించాలని మనవి’’ అని కోరుతూ లేఖను సీఎం ఆఫీస్ కి పోస్ట్ చేసింది. రంగారెడ్డి జిల్లా ఆదిభట్లకు చెందిన 5వ తరగతి అమ్మాయి అంజలి తన పుట్టిన రోజు సందర్భంగా ఈ లేఖ రాసి సీఎం రేవంత్ రెడ్డికి పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ లెటర్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చిన్నారి అంజలి లేఖపై సీఎం రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారో అని అందరూ వేచి చూస్తున్నారు. ఈ లేఖ రాసిన అంజలిని తోటి విద్యార్థులు, టీచర్లు, గ్రామస్తులు అభినందిస్తున్నారు.