భారత్ సమాచార్, జాతీయం : భారీ వర్షాలు, వరదలతో తమిళనాడు అతలాకుతలం అవుతోంది.. వర్షాలు తగ్గినప్పటికీ ప్రజలను కష్టాలు వీడడం లేదు. వారు పడే బాధలు వర్ణానీతం. ఇక దక్షిణ తమిళనాడులో గత వారం కింద కురిసిన వర్షాలకు వారి వ్యధలకు అంతే లేదు. తూత్తుకుడి ప్రాంతం దారుణంగా దెబ్బతింది. వరదల కారణంగా కొన్ని గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఇదిలా ఉంటే వారికి కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి.
వరదల వల్ల గ్రామాల్లోని శ్మశాన వాటికలన్నీ మునిగిపోవడంతో అక్కడి ప్రజలు శవాలను ఇండ్ల ముందే కాల్చే దుస్థితి ఏర్పడింది. చనిపోయిన వారి ఇంటి ముందే అంతిమ సంస్కారాలు చేస్తున్నారు. ఇలా చేయడానికి మొబైల్ శ్మశాన వాటికలను ఉపయోగిస్తున్నారు. ఈ దృశ్యాలు ఇప్పుడు యావత్ దేశాన్ని కంటతడి పెట్టిస్తున్నాయి. ఎల్పీజీ సిలిండర్లు ఉపయోగించి శవాలను దహనం చేస్తున్నారు. ఎడతెరిపి లేని వానలతో వివిధ కులాలకు కేటాయించిన శ్మశాన వాటికలు అన్నీ బురద, నీళ్లతో నిండిపోయాయి. కనీసం కట్టెలు కూడా దొరకడం లేదు. దీంతో ఆల్టర్ నేట్ ప్రయత్నాలు చేస్తున్నారు.
శ్మశాన వాటికలు రెండు అడుగుల నీటిలో మునిగి ఉన్నాయని అక్కడి వాసులు ఏడుస్తూ చెప్తున్నారు. కొంతమంది తమ వారి డెడ్ బాడీలను ఇతర ప్రాంతాలకు తరలించి అంతిమ సంస్కారాలు చేస్తున్నారు. దీనికి చాలా ఖర్చు అవుతుండడంతో.. కొందరు చేసేదేం లేక ఇండ్ల ముందే మొబైల్ శ్మశాన వాటికల్లో దహనం చేస్తున్నారు. ఇలా చేస్తున్నప్పుడు వారి రోదనలు మిన్నంటుతున్నాయి. కనీసం అంతిమసంస్కారాలైన చేయలేకపోతున్నామనే బాధ వారిని వెంటాడుతోంది. ఒకవేళ నీళ్లు తగ్గినా.. శవాలను పూడ్చిపెట్టేందుకు అనువుగా ఉండాలంటే మరో ఐదు నెలల దాక పడుతుందని వాపోతున్నారు.
ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనేందుకు స్థానికులు రెండు ఎల్పీజీ సిలిండర్లు ఉపయోగించి టెంపరరీ శ్మశాన వాటికను ఏర్పాటు చేశారు. క్రైస్తవులు మాత్రం తప్పేది లేకపోవడంతో శవాలను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. హిందువులు మాత్రం మొబైల్ శ్మశాన వాటికను ఉపయోగిస్తున్నారు. తూత్తుకుడి తో పాటు తిరునల్వేలి జిల్లాలు వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.