భారత్ సమాచార్, సినీ టాక్స్ : తెలుగింటి పండుగ సంక్రాంతి. ఏపీలో సంక్రాంతే పెద్ద పండుగ. జనాలు ఈ పండుగను ఎంతగా గొప్పగా చేసుకుంటారో ఆంధ్రా పల్లెల్లోకి వెళ్లి చూస్తేనే అర్థమవుతుంది. సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు ప్రతీ ఇంట్లో హడావిడే. చుట్టాలతో కళకళలాడుతుంటాయి. అలాగే ఆటలు, పాటలు, జాతరలు, కోళ్లపందేలు.. ఇలా ఒక్కటేమిటి ఎన్నెన్నో సంబరాలు. అన్నింటికన్నా ముఖ్యంగా మన తెలుగు సినిమాలకు సంక్రాంతి పెద్ద పండుగ. సంక్రాంతికి వచ్చిందంటే బొమ్మ అదిరినట్టేనని నిర్మాతలు భావిస్తారు. సంక్రాంతి అంటే అంతగా సెంటిమెంట్ తో ఉంటారు. కచ్చితంగా సంక్రాంతికే రిలీజ్ చేయాలని హీరోలు, దర్శకులు పట్టుబట్టుతుంటారు.
ఇప్పుడీ సంక్రాంతి సినిమాల పంచాయితీపై టాలీవుడ్ పెద్దలు మంతనాలు జరుపుతున్నారు. ఇంకా కొలిక్కి రాలేదని వినికిడి. నిన్న జరిగిన సమావేశంలో ఒకరిద్దరిని వాయిదా లేదా ముందే రిలీజ్ చేసేలా ఒప్పించే క్రమంలో ఎలాంటి ఫలితం కనిపించడం లేదని ఫిల్మ్ నగర్ టాక్. జనవరి 12న గుంటూరు కారం ఉంది కాబట్టి.. ఒకరోజు ముందుగా హనుమాన్ వస్తే బాగుంటుందని పెద్దలు ప్రతిపాదించారు. అయితే వారు ఒప్పుకోలేదట. అలాగే ఎవరైనా జనవరి 1తేదీన వస్తే కనీసం పదిరోజుల ఓపెన్ గ్రౌండ్ దొరకుతుంది అని కూడా సూచించారట. అయినా దీనికి కూడా ఒప్పుకోవడం లేదట.
ఈ రాయబార చర్చల్లో దిల్ రాజు, నాగవంశీ, సురేశ్ బాబు, విశ్వప్రసాద్ తదితరులు పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. జనవరి 12న గుంటూరు కారం, హనుమాన్, 13న ఈగల్- సైంధవ్, 14న నా సామిరంగ డేట్లు ఫిక్స్ చేసుకున్నాయి. వీటితో పాటు తమిళ సినిమాలు ఉన్నాయి. ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’, శివ కార్తికేయన్ ‘అయలన్’ ఉన్నాయి. అనువాద చిత్రాల సంగతి అటుంచితే.. ఇక మన తెలుగు హీరోలు, నిర్మాతలు ఎవరూ తమ డేట్లను కదిలించడానికి ఇష్టపడడం లేదట.
సినిమా డేట్లపై ఈ రెండు, మూడు రోజుల్లో తేల్చేయాలని సినీ పెద్దలు భావిస్తున్నారు. ఎందుకంటే థియేటర్లు తేలితేనే వారు సినిమా ప్రమోషన్లు గట్రా చేసుకోవాల్సి ఉంటంది. సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది.