భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా : ‘‘చదివిన చదవంతా వృథా అయిపోతోంది. పది సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న వారు కొందరుంటే.. గత ఐదారేండ్లుగా ప్రిపేర్ అయ్యేవారు భారీ సంఖ్యలో ఉన్నారు. అలాగే గత రెండేండ్లుగా ప్రిపేర్ అవుతున్న వారు లక్షల్లో ఉన్నారు..’’ వీరందరికీ ఈ పరీక్షల మీద నమ్మకం సన్నగిల్లుతోంది. రాత్రంబవళ్లు కష్టపడి చదివినా.. తమ ప్రతిభను పరీక్షించుకునే అవకాశమే వారికి దక్కడం లేదు. జనవరి 6,7న జరగాల్సిన గ్రూప్-2 పరీక్షను ప్రభుత్వం మూడో సారి వాయిదా వేసింది. పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించింది.
2022 మార్చిలో మాజీ సీఎం కేసీఆర్ 80వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఆ తర్వాత నోటిఫికేషన్లు వచ్చాయి. పరీక్షల తేదీలు సైతం ఇచ్చారు. అయితే జూన్ 2022లో జరగాల్సిన మెయిన్స్ పరీక్షకు అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్న క్రమంలో ప్రిలిమ్స్, సహ ఇతర పరీక్షల ప్రశ్నపత్రాలు లీకేజీ అయ్యాయి. దీంతో వాటన్నంటినీ రద్దు చేసి మళ్లీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.
ఇదిలా ఉండగా రాష్ట్రంలోనే అత్యంత క్రేజ్ ఉన్న గ్రూప్-2 పరీక్షలను మొదటగా 2023 ఆగస్టు 29, 30న డేట్లు ఇచ్చారు. 783 పోస్టులకు సుమారు 5.50లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే లీకేజీలు, పరీక్షల రద్దుతో సరిగ్గా ప్రిపరేషన్ చేయలేకపోయాయని, పరీక్షలు వాయిదా వేయమని అభ్యర్థులు భారీ ఎత్తున ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వం దిగి వచ్చి పరీక్షను నవంబర్ 2,3 తేదీలకు మార్చింది. ఈసారి పరీక్షలకు ఎన్నికల నిర్వహణ అడ్డువచ్చింది. దీంతో టీఎస్పీఎస్సీ బోర్డు మళ్లీ పరీక్షలను వాయిదా వేయక తప్పలేదు. జవనరి 6,7 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని బోర్డు ప్రకటించింది.
ఉద్యోగాల నిర్వహణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం కావడంతో నిరుద్యోగుల్లో ఆవేశం కట్టలుతెచ్చుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయేందుకు నిరుద్యోగులే ప్రధాన కారణమయ్యారు. నిరుద్యోగుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త బోర్డు ఏర్పాటు చేసిన తర్వాతనే పరీక్షలు నిర్వహిస్తామని తాజాగా మూడో సారి పరీక్షలను వాయిదా వేసింది. మరి బోర్డు ప్రక్షాళన ఎప్పుడు చేస్తారు? మళ్లీ సార్వత్రిక ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం చూస్తే నిరుద్యోగుల విషయంలో నింపాదిగా వ్యవహరించేలా కనపడుతోంది. దీంతో నిరుద్యోగుల్లో ఓపిక నశించిపోతోంది.