భారత్ సమాచార్, సినీ టాక్స్ : కౌన్ బనేగా కరోడ్ పతి(కేబీసీ).. వినోదం, విజ్ఞానం ఏకకాలంలో రెండింటినీ అందించిన దేశంలోనే పాపులర్ షో. అమితాబ్ బచ్చన్ కెరీర్ సందిగ్ధంలో పడి.. ఆర్థిక పరిస్థితి కూడా దిగజారిపోయి తీవ్ర నైరాశ్యంలో ఉన్నప్పుడుకేబీసీ షో ప్రారంభమైంది. ఈ షో సూపర్ హిట్ కావడంతో అమితాబ్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సి రాలేదు. మళ్లీ ఆయన స్టార్ తిరిగిపోయింది. ఆయన పట్టిందల్లా బంగారమైంది. 80ఏండ్ల వయసున్న అమితాబ్ ఇప్పటికీ ఒక్క నిమిషం కూడా రిలాక్స్ కాలేదంటే.. కేబీసే కారణం. అమితాబ్ జీవితంలో సినిమాలు, కేబీసీ రెండు కండ్లు లాంటివే అని చెప్పాలి.
అంతటి పాపులర్ షో.. ఇక ముగింపు దశకు వచ్చిందనే చెప్పాలి. 15 సీజన్ల పాటుగా అలరించిన ఈ షోకు ముగింపు వాక్యం పలికారు. అఖరి ఎపిసోడ్ ను రీసెంట్ గా అమితాబ్ పూర్తి చేశారు. ఈ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు. ఈ షో స్టార్ట్ అయినప్పుడే ఈ ప్రయాణానికి ఏదో ఒకరోజు ముగింపు ఉంటుందని తెలుసు. అది ఈ రోజు వచ్చిందని అమితాబ్ కన్నీరు కార్చారు.
అయితే ఈ షోను కంటిన్యూ చేసే అవకాశాలు తక్కువే ఉన్నాయి. ఎందుకంటే బిగ్ బీ ఆరోగ్యం కూడా సహకరించడం లేదని తెలుస్తోంది. అలాగే దేశవ్యాప్తంగా వివిధ రియాల్టీ షోలు పెరిగిపోయాయి. వాటి మధ్య ఆధిపత్య పోరు పెరిగింది. ఆడియన్స్ కూడా నాలెడ్జ్ ప్రోగ్రాంల కంటే ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రాంల వైపే మొగ్గుచూపుతున్నారు. ఇక కేబీసీ ప్రయాణానికి ఫుల్ స్టాప్ పడే అవకాశాలు కనపడుతున్నాయి. రెండు దశాబ్దాలుగా బుల్లితెర ఆడియన్స్ ను అలరించిన కౌన్ బనేగా కరోడ్ పతి ఇక రాదనే విషయం అందరికీ ఒకింత బాధగానే ఉందని చెప్పాలి.