భారత్ సమాచార్, సినీ టాక్స్ : సినిమా కథ బాగుంటే మన తెలుగు జనాలు ఏ సినిమానైనా ఆదిరిస్తారు అనేది తెలిసిందే. తమిళ హీరోలైన రజినీ, కమల్, సూర్య, కార్తి, విశాల్, విక్రమ్, విజయ్ లకు తెలుగు నాట మంచి మార్కెట్ ఉంది. కన్నడ నుంచి యశ్, ఉపేంద్ర, మలయాళం నుంచి మోహన్ లాల్, మమ్ముట్టి, ఆయన తనయుడు దుల్కర్ సినిమాలను తెలుగు జనాలు బాగానే ఆదరిస్తారు. ఇక 2023లో డబ్బింగ్ చిత్రాల జోరు అంతంత మాత్రంగానే ఉందని చెప్పాలి. చాలా సినిమాలు జనాలను మెప్పించలేకపోయాయి.
సంక్రాంతి కానుకగా వచ్చిన విజయ్-దిల్ రాజు-వంశీ పైడిపల్లి కాంబోలో వచ్చిన ‘వారసుడు’ మూవీ తమిళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే తెలుగు జనాలకు అంతగా నచ్చలేదు. దాంతో పాటు సంక్రాంతి చిరు, బాలయ్య సినిమాలు రావడం.. అవి రెండూ సూపర్ డూపర్ కావడంతో వారసుడు తెలుగు జనాలను ఆకట్టుకోలేకపోయాడు. అయితే ఆ తర్వాత వచ్చిన విజయ్ ‘లియో’ మంచి వసూళ్లనే రాబట్టింది.
ఇక బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కు ఈ ఏడాది బాగా కలిసివచ్చింది. పఠాన్, జవాన్ ..చిత్రాలు రూ.1000కోట్ల క్లబ్ లో చేరి రికార్డులు సృష్టించాయి. తెలుగులో కూడా మంచి ఫలితాన్ని చవిచూశాయి. ముఖ్యంగా మల్టీఫ్లెక్స్ ల్లో షారుఖ్ సందడి కనిపించింది. అయితే ఈ ఏడాది చివర్లో వచ్చిన ‘డంకీ’ జనాలను మెప్పించలేకపోయింది. ‘సలార్ ’ దెబ్బకు ఏమాత్రం కలెక్షన్లను తెచ్చుకోలేకపోయింది.
సూపర్ స్టార్ రజినీకాంత్ తన ‘జైలర్’ మూవీతో అదరగొట్టాడు. ఏ హడావిడి లేకుండా వచ్చిన ఈ మూవీ ‘‘నువ్వు కావాలయ్యా..’’ సాంగ్ తో ఈ మూవీకి మంచి ఓపెనింగ్సే వచ్చాయి. అలాగే రజినీ యాక్టింగ్, కథ, కథనం బాగుండడంతో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. రణబీర్ కపూర్ ‘యానిమల్’ తో తొలిసారి తెలుగు మార్కెట్ ను షేక్ చేశాడు. అలాగే మణిరత్నం ‘‘పొన్నాయిన్ సెల్వన్-2’ తమిళంలో హిట్ గా నిలిచిన మన దగ్గర బోల్తా కొట్టింది. సినిమా అంతా తమిళ వాసనతో తెలుగు ప్రేక్షకులకు అంతగా రుచించలేదు. ధనుష్ ‘సార్’ తో మంచి విజయాన్ని అందుకున్నారు.
మలయాళ చిత్రం ‘2018’ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. కేరళ వరదల నేపథ్యంలో వచ్చిన ఈ మూవీకి మంచి ప్రశంసలు దక్కాయి. విజయ్ అంటోనీ బిచ్చగాడు-2, సిద్దార్థ్ చిన్నా పెద్దగా ప్రభావాన్ని చూపలేదు. కన్నడ సూపర్ స్టార్స్ శివరాజ్ కుమార్, ఉపేంద్ర నటించిన ‘కబ్జా’ డిజాస్టర్ గా నిలిచింది. దుల్కర్ సల్మాన్ ‘కింగ్ ఆఫ్ కొత్త’, కార్తి ‘జపాన్’, లారెన్స్ జిగర్ తండా, చంద్రముఖి-2, శివకార్తికేయన్ ‘మహావీరుడు’, విశాల్ ‘మార్క్ అంటోనీ’ ఆకట్టుకోలేకపోయాయి. ఇక చిన్న సినిమాగా వచ్చిన ‘యూత్ హాస్టల్’ కు యూత్ కు బాగానే కనెక్ట్ అయ్యింది. మొత్తానికి ఈ ఏడాదిలో డబ్బింగ్ చిత్రాలు మిశ్రమ ఫలితాన్ని చూశాయి.