భారత్ సమాచార్, సినీ టాక్స్ : సామాన్య కుటుంబంలో పుట్టిన నారాయణమూర్తి సామాన్యుల జీవితాలను తెరకెక్కించడాన్నే బాధ్యతగా తీసుకున్నారు. ప్రజల్లో చైతన్యం రగిలించడానికి విప్లవ సినిమాలు తీస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్నారు. సామాన్య ప్రజలపై జరుగుతున్న అన్యాయాలను తన సినిమాల ద్వారా ప్రశ్నిస్తున్నారు. గత నలభై ఏండ్లు సినీ పరిశ్రమలో ఉన్న నారాయణమూర్తి మొన్నటి ‘యూనివర్సిటీ’ దాక ఆయన సినిమాలది ప్రజల దారే. ప్రజల సమస్యలే ఆయన సమస్యలు. ఈరోజు పీపుల్స్ స్టార్ నారాయణ మూర్తి జన్మదినం సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు మీకోసం..
నారాయణమూర్తి ‘నీడ’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చారు. ఆ తర్వాత ‘అర్ధరాత్రి స్వాతంత్ర్యం’, ‘దండోరా’, ‘ఎర్రసైన్యం’, ‘ఒరేయ్ రిక్షా’, ‘చీమలదండు’, ‘రాజ్యాధికారం’, ‘పోరు తెలంగాణ’, ‘వీరతెలంగాణ’..ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు. ఒక దశలో నారాయణ మూర్తి సినిమా వస్తుందంటే పెద్ద హీరోలు సైతం తమ సినిమాను వాయిదా వేసుకునేవారు. ఆయన సినిమాలకు అంతా క్రేజ్. 90దశకంలో ఆయన సినిమాలు అప్పటి జనాలను ఒక ఊపు ఊపేసిందనే చెప్పాలి. ఆప్రాంతంలో ఉమ్మడి రాష్ట్రంలో నక్సలిజం హవా ఉండేది. ప్రజలంతా చైతన్యవంతులుగా పోరాటాల్లో ముందుండేవారు. అలా ప్రజల సమస్యలను, ప్రజాచైతన్యాన్ని, నాటి కాలమాన పరిస్థితులను నారాయణమూర్తి తెరకెక్కించేవారు. ఇప్పటికి నారాయణ మూర్తి దగ్గర కేవలం రెండు జతల బట్టలు మాత్రమే ఉన్నాయి. అవీ కూడా తెల్ల చొక్కా, తెల్ల ఫ్యాంటు మాత్రమే. వాటినే ఉత్కుకొని వాడుకుంటూ ఓ చిన్న గదిలో ఉంటారు.
నారాయణమూర్తి తనకంటూ ఏమీ సంపాదించుకోలేదు. ఇల్లు, కారు కొనుక్కోలేదు. చివరికి పెళ్లి కూడా చేసుకోకుండా ప్రజల కోసమే తన జీవితాన్ని అంకితం చేశారు. ఇప్పటికీ ఎక్కడికైనా రావాలంటే ఆటోలోనే వస్తారు. ఇక దూరప్రయాణమైతే బస్సు, రైలులో వస్తారు. సాధారణ మనిషిలా నారాయణమూర్తి జీవిస్తారు.