HomeUncategorizedనిరుద్యోగులకు తెలుగులో నచ్చని ఒకే పదం ‘త్వరలో’!

నిరుద్యోగులకు తెలుగులో నచ్చని ఒకే పదం ‘త్వరలో’!

భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా : తెలంగాణ నిరుద్యోగులకు తెలుగులో నచ్చని ఒకే పదం ‘త్వరలో’. గత పదేండ్లుగా వినివిని అలసిపోయారు. ‘త్వరలో’ ఎప్పుడొస్తుందో.. మంచి రోజులు ఎప్పుడొస్తాయో వారికి అసలే తెలియడం లేదు. దశాబ్ద కాలంగా ‘‘కొలువుల జాతర’’, ‘‘కొలువుల పండుగ’’ అనే మాటలు.. కర్ణకఠోరంగా ఉంటున్నాయి.

తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తాం అని కాంగ్రెస్ నేతలు చెప్పారు. వారి చెప్పిన ప్రకారం.. ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. మరి ఇప్పటివరకూ టీఎస్పీఎస్సీ బోర్డు రాజీనామాలే ఆమోదించలేదు. ఇంకా కొత్త బోర్డును ఏర్పాటు చేయలేదు. ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే ఏ పరీక్ష రాయకుండా 2023 గడిచిపోయింది. లక్షల్లో అప్పులు తెచ్చి నిరుద్యోగులు ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. కొందరు ఇప్పటికే తమవల్ల కాదని ఆవేదనతో కాడి దించేశారు. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బోర్డు ఏర్పాటుపై వేగవంతంగా నిర్ణయాలు తీసుకోవడం లేదు.

ఫిబ్రవరి 1న నోటిఫికేషన్ రాకుంటే.. ఫిబ్రవరి 15 తర్వాత లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. ఎన్నికల కోడ్ మే వరకు ఉంటుంది. అంటే ఇక లోక్ సభ ఎన్నికల వరకు ఏ ఎగ్జామ్ రాయకుండా ఉండాలా? ఆ తర్వాత జూన్ లో నోటిఫికేషన్ వేసినా.. అది రిజల్ట్ రావాలంటే 2025 రావాల్సిందేనా?. ఇంత జాప్యాన్ని నిరుద్యోగులు భరించగలరా? వారిలో ఆవేశం ఇప్పటికే కట్టలు తెంచుకుంటోంది. దాని పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు. మరీ ప్రభుత్వం బోర్డు ఏర్పాటుపై ఏ నిర్ణయం తీసుకోవడం లేదు. ఇక తాత్కాలిక ఉపశమనంగా మెగా డీఎస్సీకి చర్యలు తీసుకోండి అని ఆదేశాలు ఇచ్చారు. దీనికి మీడియా అంతా ‘త్వరలోనే మెగా డీఎస్సీ’ అని హెడ్ లైన్స్ పెట్టేశారు. త్వరలో అంటే మరో పదహేను రోజులా? నెల రోజులా?.. చర్యలు తీసుకోమన్నారు అంతే కదా. అంటే అది తేలే వరకు ఐదారు నెలలు పడుతుంది. అప్పుడు ఏ పదివేల పోస్టులో వేస్తారు. దానికి త్వరలో మెగా డీఎస్సీ అనడం ఎందుకు అని నిరుద్యోగులు మండిపడుతున్నారు.

మరికొన్ని కథనాలు…

టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామాలో బిగ్ ట్విస్ట్!

RELATED ARTICLES

Most Popular

Recent Comments