భారత్ సమాచార్, సినీ టాక్స్ ; సినిమా అంటే కథలో కొత్తదనం ఉండాలి..ఎవరూ ఊహించని ట్విస్ట్ లు ఉండాలి..ఆడియన్స్ ను కొత్తలోకంలోకి తీసుకెళ్లాలి. థియేటర్ బయటకు వచ్చినా సినిమాలోని ఎమోషన్ గుండెలను తడుతూ ఉండాలి.. అలాంటి కథలే కొన్నేండ్ల పాటు గుర్తుండిపోతాయి. ఏదో హిట్ వస్తే చాలు అనుకుని ఆరు మాస్ పాటలు, మూడు ఫైట్లు, కొద్దిగా కామెడీ ట్రాక్.. వండివారిస్తే చాలు హిట్ అయిపోద్ది అనుకుంటే ఎలా?. అలాంటి సినిమాలు ఏదో ఎంటర్ టైన్ చేస్తాయి. పెట్టిన పెట్టుబడి వస్తుంది తప్పా..ఆ సినిమా ఎవరికైనా పదికాలాల పాటు గుర్తుంటుందా?
మహేశ్ ‘గుంటూరు కారం’, కింగ్ నాగార్జున ‘నా సామిరంగ’ మూవీ చూస్తే అలానే అనిపిస్తుంది. సినిమాకు హిట్ టాక్ వచ్చినా..కథలో కొత్తదనం ఏమీ లేదు. ఇలాంటి స్టోరీలు ఇప్పటికీ వేలల్లో వచ్చాయనే చెప్పాలి. భారీగా జుట్టు పెంచుకుని వేట కొడవళ్లు చేతిలో పట్టుకుని ఎలివేషన్ ఇస్తూ, దాన్ని చూపిస్తూ కొంచెం కామెడీని, కొద్దిగా లవ్ ట్రాక్… జనాలను ఎంటర్ టైన్ చేసే ప్రయత్నమే ఇది తప్పా..వేరే ఏం కాదు.
ఈ సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ .. మూస సినిమాలు కాబట్టే ‘హనుమాన్’ వంటి చిన్న సినిమా ఈసారి సంక్రాంతి విజేతగా నిలిచింది. సినిమా కథలో కొత్తదనం, అద్భుతమైన స్క్రీన్ ప్లే, ఎలివేషన్స్.. అన్నీ కుదిరాయి కాబట్టి సినిమా టాప్ ప్లేస్ లోకి వెళ్లిపోయింది. ఇక మన సీనియర్ హీరోలు ఇంకా రొట్టకొట్టుడు కథలనే నమ్ముకోవడం.. దురదృష్టకరం.
కొత్త హీరోలు సైతం సినిమా సినిమాకు వైవిధ్యం చూపించాలని తహతహలాడిపోతుంటారు. విభిన్నమైన కథలను ఎంచుకుంటారు. ఇక మన సీనియర్ హీరోలు మాస్ ఓరియాంటెడ్ లైన్ నుంచి బయటకు రావడం లేదు. నా సామిరంగ సినిమానే తీసుకుంటే..సినిమా ఫర్వాలేదు అనిపిస్తుంది. పాత చింతకాయ కథనే అయినప్పటికీ ఏదో కొద్దిగా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తోంది. ఇక నరేశ్ పాత్ర ఎమోషన్ పండిస్తుంది. అంతే మినిమం గ్యారెంటీగా తీశారు తప్ప.. అందులో కొత్తదనం ఏమీ లేదు.
ఏదో తీయాలి కాబట్టి తీస్తున్నారు అనిపిస్తుంది ఈ కథలను చూస్తే. ఇక నాగ్ తన ఫోకస్ అంతా షోలపై పెట్టాడు. ఇలా ఏడాదికో సినిమా తీయాలి లేదంటే ఆడియన్స్ తో డిస్టెన్స్ వస్తుందనే ఆలోచన ఆయనలో ఉన్నట్టుంది. ఇక గుంటూరు కారం స్టోరీని తీసుకుంటే నాలుగు పాత సినిమాలను మిక్స్ చేసి కొత్తగా తయారు చేశారు అంతే. మన సీనియర్ హీరోల సినిమా లెక్కలు ఇప్పటికైనా మారాలి. తమిళంలో సూర్య, తెలుగులో నాని వంటి వారిని చూసైనా కథల ఎంపిక ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలి. కథను కొత్తగా, ఆడియన్స్ ఆకట్టుకునేలా సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది. అదే సూపర్ ఫార్ములా. అంతే కాని ఏదో బీడీ కాల్చి, లుంగీ కట్టి, ఆరు పాటలు, నాలుగు ఫైట్లు, ఓ మదర్ సెంటిమెంటో, బ్రదర్ , సిస్టర్ , చైల్డ్ సెంటిమెంటో పండిస్తే.. ఆ సినిమా జనాలను ఎలా ఆకట్టుకుంటుంది. అందుకే కొత్తగా ఆలోచించాలి. అలా తీసిన సినిమాలకు జనాల ఆదరణ ఎప్పుడూ ఉంటుంది.