భారత్ సమాచార్, జాతీయం : రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి భారీ ఎత్తున భద్రతా సిబ్బందిని నియమించారు. దీనికి ఓ కారణముంది. అయోధ్యలో జరిగే రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో విధ్వంసం సృష్టిస్తామని, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను హత్య చేస్తామని ఖలీస్థాని ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హెచ్చరించాడు. ముగ్గురు ఖలీస్థానీ సానుభూతి పరులను గత శుక్రవారం ఉత్తర ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ మేరకు పన్నూ హెచ్చరిక సందేశం పంపాడు.
పన్నూ కథ ఏంటి?
గురుపత్వంత్ సింగ్ పన్నూ అమృత్ సర్ జిల్లాలోని ఖాన్ కోట్ గ్రామంలో జన్మించాడు. అతడి తండ్రి పంజాబ్ స్టేట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ బోర్డులో ఉద్యోగి. పంజాబ్ యూనివర్సిటీ, చండీగఢ్ లో న్యాయ పట్టా పొందిన పన్నూ.. సిక్ ఫర్ జస్టిస్ కు న్యాయ ప్రతినిధి. అతడికి కెనడాతో పాటు అమెరికా పౌరసత్వం కూడా ఉంది. భారత్ ను వదిలి విదేశాలకు వెళ్లిన పన్నూ తొలుత అక్కడ డ్రైవర్ గా పనిచేశాడు. కొంత కాలం తర్వాత న్యాయవాద వృత్తిని చేపట్టాడు. జులై 2023లో ఒక వీడియోను విడుదల చేసిన పన్నూ.. ఉత్తర అమెరికా, యూరప్ లోని భారతీయ దౌత్యవేత్తలను హత్య చేయాలని పిలుపునిస్తూ పోస్టర్లను ముద్రించాడు. భారత్ ప్రభుత్వం గురుపత్వంత్ సింగ్ పన్నూను 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది. దేశద్రోహ కేసుతో సహ 20కి పైగా క్రిమినల్ కసులు ఉన్నాయి. భారత్ సిక్కుల మానవ హక్కులను ఉల్లంఘిస్తోందని ఆరోపణలు గుప్పిస్తుంటాడు.
అయితే ఆయన హెచ్చరిక వీడియోలకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సీరియస్ గానే ఉన్నారు. భారత ప్రభుత్వంతో చెలగాటమాడుతున్న పన్నూ ఏదో ఒకరోజు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.