భారత్ సమాచార్, సినీ టాక్స్ : సమ్మర్, వింటర్ లాగా తెలుగు చిత్ర పరిశ్రమకి కూడా కొన్ని సీజన్ లు ఉంటాయి. కొన్ని సార్లు వరుస పెట్టి యాక్షన్ చిత్రాలు లేదా ఫీల్ గుడ్ మూవీస్ కాకపోతే హర్రర్ కామెడీ సినిమాలు విడుదల అవుతాయి. ఈ ట్రెండ్ పై ప్రేక్షకుల విసుగు చెందే వరకు దాన్ని అలాగే కొనసాగిస్తుంటారు దర్శకనిర్మాతలు. ఇది ఎలక్షన్స్ జరిగే సంవత్సరం కాబట్టి టాలీవుడ్ లో బాక్సాఫీస్ వద్ద పొలిటికల్ మూవీస్ వరుస పెట్టి రిలీజ్ అవుతున్నాయి. పొలిటికల్ మూవీస్ అంటే ‘లీడర్’, ‘భరత్ అనే నేను’,‘రిపబ్లిక్’ వంటి సినిమాలు అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇవి రాజకీయ నాయకుల ‘యాత్ర 2’, ‘రాజధానిఫైల్స్’, ‘వ్యూహం’ వంటి సినిమాలు. ప్రచారానికి కాదేదీ అనర్హం అనే సినీ నానుడిని పట్టుకొని అన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీ విధానాలకు, సిద్ధాంతాలకు అనుకూల, వ్యతిరేక సినిమాలను టాలీవుడ్ లో ప్రతి శుక్రవారం విడుదల చేస్తున్నాయి.
2019 ఎలక్షన్స్ జరిగే సమయంలో అప్పుడు తెలుగుదేశం పార్టీ కోసం బాలయ్య బాబు ‘ఎన్టీఆర్ కథనాయకుడు’ చిత్రాన్ని రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. కానీ బాక్సాఫీస్ వద్ద, ఎలక్షన్స్ లో కూడా అనుకున్న రిజల్ట్ ను పొందలేకపోాయారు. దానికి కౌంటర్ గా వైసీపీ పార్టీ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘లక్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని ప్రజల ముందుకు తెచ్చింది. అంతే కాకుండా మమ్ముట్టి కథానాయకుడిగా ‘యాత్ర’ సినిమాని కూడా బరిలోకి నిలిపింది.
ఇక 2024 ఎలక్సన్స్ కోసం వైసీపీ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తమ ‘వ్యహాం’ కొనసాగించింది. దానికి వ్యతిరేకంగా టీడీపీ కోర్టు మొట్లు ఎక్కి స్టే తెచ్చుకుంది. అక్కడితో ఆగిపోకుండా వైసీపీ ‘యాత్ర 2’ను బరిలో నిలిపింది. టీడీపీ ‘రాజధాని ఫైల్స్’ అంటూ కౌంటర్ వదిలింది.‘యాత్ర 2’ ఫిబ్రవరి 8వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ‘రాజధాని ఫైల్స్’ ఫిబ్రవరి 15న బరిలో నిలువనుంది. ‘వ్యహాం’ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉంది.