భారత్ సమాచార్, జాతీయం ; ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. అంతా ఫ్రీ. దేశంలో కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎక్కడ చూసినా ఈ ఉచిత స్కీములే ఎన్నికల్లో పని చేస్తున్నాయి, రాజకీయ అధికారాన్ని కట్టబెడుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు కూడా మమ్మల్ని గెలిపించండీ, మీకు తినడానికి ఉప్పు, పప్పు దగ్గరి నుంచి బతకడానికి అప్పు కూడా ఇస్తామని అమలు కాని హామీలను ఎన్నికల ముందు గుప్పిస్తున్నాయి. పుట్టినప్పటి నుంచి చనిపోమే వరకు ఏ పని చేయకున్నా కంటికి రెప్పలా చూసుకుంటాం అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అనవసర పథకాలను అమలు చేస్తూ ప్రజల్ని సోమరిపోతులను చేస్తున్నాయి.
ఎన్నికలు వస్తే చాలు మన దేశంలో రాజకీయ పార్టీలు పోటీ పడి మరి ప్రజలకు సకల రకాల ఉచిత పథకాలు ప్రకటిస్తున్నాయి. వివిధ వర్గాల వారిని ఆకర్షించడానికి తాయిలాల వలలు విసురుతున్నాయి. తీరా అధికారంలోకి వచ్చాక చెప్పిన పథకాలు అమలు చేయడం తలకు మించిన భారం అవుతోంది. దాంతో ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోడానికి కుప్పిగంతులు వేస్తున్నారు నాయకులు. తీరా మళ్లీ ఎన్నికల ముందు కొత్త అప్పులు చేసి తూతూ మంత్రంగా ఇచ్చిన హామీలను అమలు చేసినట్లు నటిస్తూ అమాయకపు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నం అవుతున్నారు.
👉 ఉచితాలకే ఓట్లు..తర్వాత పడతాం పాట్లు
ఒకప్పుడు నాయకుడిని చూసి లేదా అభివృద్ధిని చూసి ప్రజలు ఓట్లు వేసేవారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. ఓటుకు నోటు తీసుకోని ఓటు వేసేవారు కొందరైతే.. ఆయా పార్టీలు ఎన్నికలకు ముందు ఇస్తున్న ఉచిత హామీలను నమ్మి ఏ కులానికి ఎంత లబ్ధి చేకూరుతుందో లెక్కలు వేసుకోని మరి ఓట్లు వేస్తున్నారు. ప్రజలు. హామీలు ఇచ్చే నాయకులు కూడా ప్రజలకు ఎలాంటి ఉచితాలు ప్రకటిస్తే వారి బుట్టలో పడతారో ముందుగానే అంచనా వేసి పసిగడుతున్నారు. ఎన్నికల ముందు ఉచితాలు లెక్క ఎక్కువైనా పర్వాలేదుగాని తక్కువ కాకుండా చూసుకుందాం. అమలు గురించి అడిగినప్పుడు ఆలోచిద్దాం అన్నట్టు ఉంది మన నాయకుల వరుస.
👉ఇప్పుడు దేశం మొత్తం ఇదే హావా…
ఉచిత పథకాల వల్ల దేశంలో ఎన్నికల రాజకీయాలు భ్రష్టుపట్టాయి. కాల క్రమంలో సంక్షేమ పథకాలు ప్రజాకర్షణగా మారిపోయాయి. ఉచిత హామీలు ఇవ్వండంలో ఒకప్పుడు తమిళనాడు మందంజలో ఉండేది. అక్కడ ఎన్నికలు వచ్చాయంటే ప్రపంచంలో ఎక్కడ లేని ఉచితాలను ప్రచారంలో ప్రజల ముందు ఉంచుతారు. జయలలిత సీఎంగా ఉన్న వరకు ఆ హవా నడిచింది. కానీ ఇదే పరిస్థతి ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఇదే నడుస్తోంది.
👉 ప్రజలకి సోయి లేకనే ఇదంతా
ఉచితాల పేరు చెప్పి వంద రూపాయాలు ఇచ్చి మన నుంచే వెయ్యి రూపాయాలు వసూళ్లు చేసి తలకు మించిన భారం మోపుతున్నారు పాలకులు. మళ్లి ప్రభుత్వం ఇచ్చే ఒక్క పథకం అమలు కాకపోతే రోడ్లు ఎక్కుతారు, ధర్నాలు చేస్తారు. అసలు ఈ పథకాలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఎలా అమలు చేస్తున్నారు. అని కొంచెం కూడా ఆలోచించడం లేదు సామన్య ఓటర్లు. ఏది అయితే మాకేంటి హామీ ఇచ్చాడు అమలు చేయాల్సిందే అని కొన్ని చోట్ల ప్రజలు గుడ్డిగా వ్యవహరిస్తున్నారు.
👉 ఉచితాలకు సంబరపడితే..మనకు దూల తీరుతుంది మరి
ప్రస్తుతం ప్రజలు ఉచితాలకు బాగా అలవాటుపడ్డారు. ఎంత సేపు ఉత్తగా ఎది వస్తుందా..ఎప్పుడు దాన్ని అందుకుందామా అని ఆరాటపడుతున్నారే తప్ప. అసలు వీళ్లు అధికారంలోకి వస్తే మన జీవన విధానంఎంత వరకు మెరుగుపడింది. మనం ఆర్ధికంగా ఎంత ఎదిగాం. మన ఊరు, మండలం, జిల్లా, రాష్ట్రం, దేశం ఏ మేరకు అభివృద్ధి చెందిందో ఒక్కసారి అయినా ఆలోచిస్తున్నారా(చదువు రానివారు కాదు..) ఉచితాలు వద్దు అభివృద్ధి ముద్దు అని ఏ ఒక్క విద్యావంతుడైనా మాట్లాడుతున్నాడా..? అసలు అభివృద్ధి అంటే ఉచిత పథకాల తాయిలాలు కాదు. మన జీవన విధానంలో మార్పు అని ఎందుకు తెలుసుకోరు. నీకు ఉచితంగా విద్య, వైద్యం అందితే చాలు కదా..మరి అవరమైన వాటి గురించి ఆలోచించు. అందని వాటి గురించి ఆరాటం ఎందుకు..?
👉 ఒక్కసారి అభివృద్ది గురించి ఆలోచించండి
బడ్జెట్ లెక్కలు కోటలు దాటుతున్నాయి.. కానీ అభివృద్ధి గడప కూడా దాటడం లేదు. ఎందుకంటే అధికారంలోకి వాడు రావడానికి నీకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికే బడ్జెట్ సరిపోదు. ఇంక అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది. అలాంటప్పుడు నీకు విద్యా, వైద్యం, రోడ్లు, తాగునీరు సమయానికి ఎలా అందుతాయి. గ్రామాలకు సరైన రోడ్డు వసతి, విద్య , వైద్యం అందడంలేదు అంటే దానికి కారణం ఎవరు అని ఓటరు ఆలోచించాలి. పాలకులు అందించే ఉచితాలు ఏవీ కూడా ఉచితం కానే కాదు అనే విషయం ఓటర్లు గుర్తుంచుకోవాలి. అనవసర ఉచిత పథకాలు ఎందుకని పాలకులను ప్రశ్నించాలి.