భారత్ సమాచార్, ఢిల్లీ ; ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో 2024 ఎలక్షన్ పండుగ నిన్నటి నుంచి మొదలైన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి దేశ వ్యాప్తంగా ఎన్నికల నియమావళి కూడా అమల్లోకి వచ్చినట్టు ఈసీ ప్రకటించింది. మరి ఎలక్షన్ కోడ్ అంటే ఏమిటీ? వాటి నిబంధనలు ఎలా ఉన్నాయి? వాటిని అతిక్రమిస్తే ఈసీ తీసుకునే చర్యలు గురించి పూర్తి విశ్లేషణ…
దేశంలో నిర్వహించే ఎన్నికలు చట్టబద్దంగా, నిష్పాక్షికంగా, ఎటువంటి అవకతవకలకు, అవినీతికి తావు లేకుండా జరిగేందుకు ఎన్నికల సంఘం రూపొందించిన నిబంధనలనే ‘ఎలక్షన్ కోడ్’గా పిలుస్తారు. ఎన్నికల నియమావళిని అమలుచేసిన తర్వాత ప్రభుత్వ పరిపాలన యంత్రాంగంలో కొన్ని కీలకమైన మార్పులు చోటుచేసుకుంటాయి. వివిధ శాఖల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు ఎన్నికల కమిషన్ (ఈసీ) సిబ్బందిగా పనిచేస్తారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు వీరు ఈసీ అధికార పరిధిలోనే పనిచేస్తారు.
ఎలక్షన్ కోడ్ నిబంధనలు
1.ఎన్నికల కోడ్ రూల్ ప్రకారం ఒక పార్టీకి లాభం చేకూర్చేలా ప్రజాధనాన్ని వాడకూడదు.
2. కొత్త ప్రభుత్వ పథకాలు, భూమిపూజలు, శంకుస్థాపనలు, అధికారిక ప్రకటనలు ప్రభుత్వం చేయకూడదు.
3.ప్రభుత్వ వాహనాలు, విమానాలు, భవనాలను ప్రచారం కోసం వాడుకోకూడదు.
4.ఎన్నికల ర్యాలీలు, పాదయాత్రలు, బహిరంగ సభలు లాంటి ప్రజా కార్యక్రమాలు నిర్వహించే పార్టీలు, అభ్యర్థులు, వారి మద్దతుదారులు పోలీసుల నుంచి మందుస్తు అనుమతులు తీసుకోవాలి.
5.మతం, కులం పేరుతో ఏ రాజకీయ పార్టీ ఓట్లు వేయాలని అభ్యర్థించకూడదు.
6. మతాల, కులాల, ప్రాంతాల మధ్య రెచ్చగొట్టేలా, లేదా భాష పేరుతో విద్వేషాలు పెంచేలా అభ్యర్థులు లేదా రాజకీయ పార్టీలు ఎలాంటి ప్రకటనలు కానీ వ్యాఖ్యలు కానీ చేయకూడదు.
7. విమర్శించేటప్పుడు అభ్యర్థుల వ్యక్తిగత అంశాలు, ప్రజా జీవితంతో సంబంధంలేని అంశాల జోలికి పోకూడదు. నిరూపించలేని ఆరోపణలను చేయకూడదు.
8. ప్రచార సమయంలో మసీదులు, చర్చ్‌లు, దేవాలయాలు ఇతర ప్రార్థనా స్థలాలను స్వలాభానికి వాడుకోకూడదు.
9. ఓటర్లకు డబ్బులు, బహుమతులు ఇచ్చి ప్రలోభ పెట్టడం, భయపెట్టడం, దొంగ ఓట్లు వేయడం లాంటివి ఎన్నికల చట్టం ప్రకారం నేరం.
10. ఓటర్లు పోలింగ్ స్టేషన్లకు తరలించకూడదు. పోలింగ్ రోజున మద్యం సేవించడం/పంపిణీ చేయడం నిషేధం, నేరం.
11.పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్ల దూరంలో ఎలాంటి ప్రచార బోర్డులు ఏర్పాటుచేయకూడదు. పోలింగ్‌కు ముందు 48 గంటల సమయంలో ఎన్నికల ప్రచారం చేపట్టకూడదు.
ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే..?
ఏదైనా రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి ఎలక్షన్ కోడ్ ని ఉల్లంఘిస్తే నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు చేపడుతుంది. ఎలక్షన్ నియమావళిని సక్రమంగా అమలు చేసేందుకు ఎన్నికల
సంఘం పరిశీలకుల సహాయం తీసుకుంటుంది. నేరాలు తీవ్రమైనవి అయితే, ఎన్నికల్లో పోటీ చేయకుండా అభ్యర్థులపై నిషేధం విధించే అధికారం ఈసీకి ఉంటుంది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే, అభ్యర్థులను జైలుకు కూడా పంపేలా కఠిన నిబంధనలు ఉన్నాయి.