భారత్ సమాచార్, జగిత్యాల ; 2024 లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సీట్లే లక్ష్యంగా కమలం పార్టీ భారీ స్థాయిలో పావులు కదుపుతోంది. ఊహించని వ్యూహాలను అమలుపరుస్తోంది. కేంద్ర నాయకత్వం ఎన్నికల ప్రచారం పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ప్రతిపక్షాలపై భారీ స్థాయిలో విమర్శలకు దిగుతోంది.
తాజాగా ప్రధాని మోడీ జగిత్యాలలో భారీ బహిరంగ సభలో పాల్గొన్ని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర రాజకీయాలపై సంచలన ప్రకటనలు చేశారు. బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ ఫైల్స్‌ను పక్కన పెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు భారీ అవినీతి చేయటానికి ఒకరికొకరు సహకరించుకుంటున్నారు అని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల అవినీతిపై కేంద్రం విచారణ చేపడితే, వీళ్లు మోడీని తిట్టడం ప్రారంభిస్తారన్నారు. దేశంలో జరిగిన స్కామ్‌లన్నింటికీ కుటుంబపార్టీలే కారణమన్నారు. తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు ఎక్కువ వస్తే, నాకు అంత శక్తి వస్తుందన్నారు.
తెలంగాణలో క్రమంగా బీజేపీ బలపడుతోందని తెలిపారు. మే 13న రాష్ట్ర ప్రజలు కొత్త చరిత్ర సృష్టించబోతున్నారన్నారు. వికసిత్ భారత్ కోసం ఓటు వేయబోతున్నారు, లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ పనైపోతుందని అన్నారు.