Homemain slidesనా తనువుకి అద్దిన రంగుల హంగులు

నా తనువుకి అద్దిన రంగుల హంగులు

భారత్ సమాచార్, అక్షర ప్రపంచం ;
మనసు ఏకాంతం కోరింది. అందుకు కన్నయ్యను తోడు తీసుకుంది. ఇక కడలి ఓడ్డుకు కదిలింది సత్య…

సంద్రం ముందు సత్య, కృష్ణయ్య పంచలోహ విగ్రహం వారిని చూస్తూ సూర్యడు తప్ప ఇంకెవ్వరూ లేరు అక్కడ. అలల చప్పుడు మనసును తాకుతోంది. చల్లని గాలికి తనువు పులకరిస్తోంది. హఠాత్తుగా ఓ పెద్ద అల కన్నయ్యను తన లోగిలికి చేర్చుకుంది.ఎన్నడు ఎరుగని విరహవేదనతో, అతి వ్యామోహంతో కడలి కృష్ణయ్యని చుట్టుముడుతోంది. అప్పడు, అక్కడ స్త్రీ తత్వం కడలిలో కనపడుతోంది.

ఆ అమ్మాయి కోపం ఎగిసే ఉప్పెన,
ఆ మగువ ప్రేమ కంటికి ఇంపైన అల,
ఆ మహిళ మౌనం…అలసిపోయిన కడలి గోస
ఆమె ఏకాంతంగా సేద తీరుతోంది. సంద్రం ఒడ్డున తాకే ప్రతి అలని ప్రేమగా తాకుతోంది. నీటి బుడగలపైన ఆమె తన ప్రతిబింబం చూస్తూ వాటిని పగలగొడుతోంది. ప్రాణం ఉన్న బుడగలు పగిలిపోతూ మరో బుడగలో కలిసిపోతున్నాయి. సత్య అలాగే చూస్తోంది…పక్కనే ఉన్న పసుపు రంగుని తీసుకొని తన సొగసరి మెడకి పూసుకుంటోంది… తీక్షనమైన చూపులతో పసుపుకొమ్ముల వాసన చూస్తోంది, మబ్బుల చాటున దాగిన సూర్యడు ఆమెని తన కిరణాలతో పరవశింపచేస్తున్నాడు. హిందువులు ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు పసుపు రంగునే ఎక్కువగా వాడతారు. ఈ రంగును శాంతి, ఆనందం, శ్రేయస్సుకు ప్రతీకగా భావిస్తారు…

ఆ పక్కనే ఉన్న అకుపచ్చ రంగును చూస్తోంది. ఎడమచేత్తో పట్టుకొని కుడి చేత్తో పొడవైనా నడుముకి అద్దుతోంది. ఆకుపచ్చని రంగు పంట పొలాలను, ఆనందాన్ని సూచిస్తుంది. తాజాదనానికి, ప్రారంభానికి పచ్చని రంగును ఒక సూచిక, రంగు రాపిడికి ఆమె వంపైన నడుము పై అచ్చులు కనిపిస్తున్నాయి. ఒక పెద్ద అల వేగంగా వచ్చి పాదాన్ని తాకింది.

నారింజ రంగుని చూసి, ధైర్యం కోసం దాన్ని భుజాల వెనుక వీపుకి రాసుకుంది. సూర్య కాంతికి అది మెరిసిపోతోంది. బలానికి, ప్రకాశవంతమైన వెలుగుకు నారింజను ప్రతీకగా భావిస్తారు. ఈ రంగు సూర్య భగవానుడితో సంబంధం కలిగి ఉంటుంది. ఎందుకో ఆమె కళ్లు ఎరుపెక్కాయి. పొరలు, పొరలుగా నీళ్లు తిరుగుతున్నాయి.

తెలుపురంగుని చూస్తోంది, ఇది ప్రశాంతతని, సున్నితత్వాన్ని ప్రతిబింబిస్తుంది. దాన్ని కందిపోయిన చెంపలకు రాస్తోంది. పాపం ఎన్ని సంవత్సరాలు అవుతోందో సరైన ప్రశాంతత దొరకక ముఖంపై ఇంకా ఏడుపు ఛాయలు అలాగే కనిపిస్తున్నాయి.

నీలి రంగును ముట్టుకుంది. చుట్టూ తేరి పార గమనించింది. ఎవరూ చూడటంలేదు కదా అనుకోని గుప్పెడు నీలిరంగును విశాలమైన ఎదలకి హత్తుకుంది. నీలి రంగును కన్నయ్యకు చెందినదిగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ రంగు వేణు మాధవుడికి ఎంతో ప్రీతికరమైనది. కిట్టయ్య కొలువై ఉన్న బృందావనంలో హోలీ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ నీలి రంగు ఆధ్యాత్మిక పరంగా విశ్వాసం, సానుకూల శక్తికి నిదర్శనంగా భావిస్తారు. హోలీ పండుగ వేళ నీలి రంగును చల్లడం వల్ల ఎదుటివారిపై నమ్మకంతో ఉన్నామని అర్థం.

ఆమె మీద ఆమెకి నమ్మకం రంగుల్లో వస్తుందా, తన పిచ్చికాకపోతే. సత్య గులాబీ రంగుని చూస్తూ…ఇది అమ్మాయిలకు ఎంతో ఇష్టం. ఈ రంగును ఆనందాన్ని, ఇతరులపై ఉన్న ఇష్టాన్ని చెప్పటానికి వాడతారు. కొన్ని సార్లు దీన్ని స్నేహానికి కూడా ప్రతీకగా చూస్తారు. గులాబీ రంగును తలపై పోసుకుంది చాలా ఇష్టంగా, ముఖం పై నుంచి కాళ్ల వరకు రంగుల వళ్లి గా మారిన ఆమెను అలల బుడగల్లో తీక్షణంగా చూసుకుంటోంది. రంగుల నగ్నత్వంలో ఉన్న ఆమె, జలకాలట ఆడి అలసిపోయిన కన్నయ్యను హత్తుకుంటు నడుముకి పోటు చేసి నడుస్తుంది. రెండు చేతుల మధ్య జారిపోకుండా చూసుకుంటోంది. ఉక్కిరిబిక్కిరి అవుతున్న కన్నయ్య ఆమె నడుము మీద ఆసీనుడయ్యాడు.  గోవర్ధనగిరిని ఎత్తిన కృష్ణయ్యని గొప్పవాడని అన్నారు, దేవుడు అన్నారు, మరి ఆయన్నే మోస్తున్న ఆమెని, ఆ నడుముని ఏమని పొగడగలం, ఎంతని కీర్తించగలం.

ఇది
రామ్ యలగాల
రంగళించిన రంగుల హోలీ మేల
నా అక్షరాలా రంగుల్ని మనసుకి అద్దుకొని,
మత్తులో మునిగిపోండి మరి…
8019202070

మరికొన్ని ప్రత్యేక కథనాలు…

మేమే ఇండియన్స్…

RELATED ARTICLES

Most Popular

Recent Comments