Homemain slides'కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే'

‘కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే’

భారత్ సమాచార్, హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాపాలే ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. రాష్ట్రానికి కరువు కూడా కేసీఆర్‌ పాపాల వల్లనే వచ్చిందన్నారు. యాదగిరిగుట్ట పేరును యాదాద్రిగా మార్చడం కేసీఆర్‌ చేసిన మొదటి తప్పు అని, కాళేశ్వరం ప్రాజెక్టుకు దేవుడి పేరు పెట్టి.. దోచుకోవడంతోపాటు సర్వనాశనం చేశారని ఆరోపించారు. జిల్లాలు, గ్రామాల్లో నీరు లేక పంటలు ఎండిపోతుంటే చూడలేక తన కళ్లు చెమ్మగిల్లుతున్నాయని తెలిపారు. 2004 నుంచి 2014వరకు రాష్ట్రంలో వర్షాలు బాగా కురిశాయని, ఒకానొక సమయంలో కాంగ్రెస్‌ అంటేనే వర్షం, వర్షం అంటే కాంగ్రెస్‌ అనే ప్రచారం జరిగిందని, వైఎస్సార్‌ కూడా ఇదే మాట అనేవారని గుర్తు చేశారు. హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలోని తన నివాసంలో కోమటిరెడ్డి మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

ఇంటర్‌నెట్‌ పేరుతో ఐదువేల కోట్ల స్కామ్:
బీఆర్‌ఎస్‌ హయాంలో ఏ శాఖలో చూసినా స్కామ్‌లే ఉన్నాయని, అన్నింటిలోనూ ‘రావు’లే ఉన్నారని అన్నారు. ఫోన్‌ట్యాపింగ్‌ చేశామని కేటీఆరే తన వ్యాఖ్యల ద్వారా ఒప్పుకొన్నారని, ఆయనపై కేసు నమోదు చేయాలన్నారు. ట్యాపింగ్‌ రుజువైతే పదేళ్ల వరకు జైలుశిక్ష పడుతుందన్నారు. సినిమా ఇండస్ట్రీలోనూ ట్యాపింగ్‌ చేశారని, అయితే సినీ పరిశ్రమ నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదులూ రాలేదని తెలిపారు. కాగా, సచివాలయంలో ఐటీ పేరుతో కేటీఆర్‌ బావమరిదికి ఇచ్చిన కాంట్రాక్టు, నిర్వహించిన పనితోపాటు ఇంటింటికీ ఇంటర్‌నెట్‌ పేరుతో రూ.5వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఈ రెండింటిపై విచారణ చేయిస్తామన్నారు.

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలోకి హరీష్‌రావు:
భువనగిరి, నల్లగొండ స్థానాల్లో గెలుపు ఖాయమైందని, మెజారిటీపైనే ఆలోచిస్తున్నామని తెలిపారు. ఇక దానం నాగేందర్‌ బీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి.. ఇప్పుడు కాంగ్రెస్‌ తరఫున ఎంపీగా పోటీ చేస్తే లీగల్‌ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఎంఐఎంకు పొత్తు బీజేపీతోనే తప్ప.. కాంగ్రె‌స్‌తో కాదన్నారు. హైదరాబాద్‌ నుంచి అభ్యర్థిగా టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా పేరును పరిశీలిస్తున్నామన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ప్రియాంకగాంధీ తెలంగాణ నుంచి పోటీ చేసే అవకాశం లేదని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల తరువాత హరీశ్‌రావు బీజేపీలోకి వెళతారని జోస్యం చెప్పారు. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరనున్న కె.కేశవరావు, కడియం శ్రీహరి ఇద్దరూ ఘటికులని కోమటిరెడ్డి అన్నారు.

 

మరిన్ని వార్తలు:

‘ఎన్నికల్లో ఓడిపోతే కేసీఆర్ కుటుంబం విదేశాలకే’

RELATED ARTICLES

Most Popular

Recent Comments