భారత్ సమాచార్ ; ఏపీలో వాలంటీర్ వ్యవస్థ పై ఎలక్షన్ కోడ్ మొదలైనప్పటి నుంచి రచ్చ రంబోల స్థాయిలో రాజకీయం జరుగుతూనే ఉంది. దీనికి తోడు వీరితో అనుసంధానమైన పెన్షన్ల పంపిణీపై అధికార, ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శించుకుంటున్నాయి. పించణీ పంపటంలో జరిగిన జాప్యానికి కారణం రెండు ప్రధాన పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెతి పోసుకుంటున్నారు. ప్రస్తుతం గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పెన్షన్ల చూట్టూనే తిరుగుతున్నాయి. ఈ వ్యవహారంలో మొదటి నుంచి ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకొని వాలంటీర్లు లేకుండా పెన్షన్ పంపిణీ చేయటానికి కసరత్తులు చేస్తోంది. మరోవైపు ఈ పరిణామం కోర్టు మెట్లు కూడా ఎక్కింది. ఇందులో కోర్టు ఉత్తర్వులు ఎలా ఉంటాయో వేచి చూడాలి. మొత్తానికి అయితే ఈ వ్యవహారం ఈ రోజు ఓ కొలిక్కి వచ్చిందని తెలుస్తోంది. తాజాగా ఏపీ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీకి మార్గదర్శకాలు విడుదల చేసింది.
ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు…
✓ రేపటి(ఏప్రిల్ 3) నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు పెన్షన్ల పంపిణీ చేపట్టనున్నారు.
✓ గ్రామ, వార్డు సచివాలయాల్లో నగదును పంపిణీ చేస్తారు.
✓ రోగులకు, దివ్యాంగులకు మాత్రమే ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లు అందజేస్తారు.
✓ మిగిలిన వారు అందరూ సచివాలయానికి వెళ్లి తెచ్చుకోవాలి.
✓ ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకు పంపిణీ కార్యక్రమం చేపడతారు. పెన్షన్ దారులు కచ్చితంగా తమ ప్రభుత్వ గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి. ఎలక్షన్ కోడ్ ఉన్న కారణంగా సీఎం ఫోటో ఉన్న పెన్షన్ పాసు పుస్తకం తీసుకొని వెళ్లకూడదు. ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులు అంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు వంటి వాటిల్లో ఏదో ఒకటి కచ్చితంగా తీసుకెళ్లాలి.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 65.69 లక్షల మంది పెన్షన్ పంపిణీ కోసం తీవ్రంగా ఎదురు చూస్తున్నారు. మొదటి సారిగా 1.26 లక్షల గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగులు పెన్షన్ పంపిణీలో పాలుపంచుకుంటున్నారు. మరో వైపు వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ చేయవద్దన్న ఈసీ ఆదేశాలపై హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈసీ ఆదేశాలను కొట్టివేయాలని కోరుతూ గుంటూరు మహిళ కోర్టు మెట్లు ఎక్కారు. దీనిపై (ఏప్రిల్ 3న) ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది.