భారత్ సమాచార్ ; స్వాతంత్య్ర సమరయోధుడు, దళితోద్ధారకుడు, అణగారిన వర్గాల గొంతుక, భారత దేశ మాజీ ఉప ప్రధాని డా. బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతిని పురస్కరించుకొని దేశ ప్రముఖులంతా ఆ మహనీయుని సేవలను స్మరించుకుంటూ నమస్సుమాంజలులు ఘటిస్తున్నారు. సమ సమాజ నిర్మాణానికి అవిశ్రాంతంగా పోరాటం చేసిన దళిత జాతి ముద్దుబిడ్డ గా ఆయన సేవలను స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు దేశ ప్రముఖులంతా ఆయన సేవలను నేడు జయంతి సందర్భంగా కొనియాడారు. ఆయన 5 ఏప్రిల్ 1908 న జన్మించారు.
దళితుల ఆశాజ్యోతి, కార్మిక పక్షపాతి గా డా. బాబు జగ్జీవన్ రామ్ ని దేశ ప్రజలు గుర్తుంచుకున్నారు.అత్యంత కఠిక పేదరికంలో జన్మించిన బాబూజీ అకుంఠిత దీక్షతో అత్యున్నత స్థానానికి ఎదిగారు. జాతీయోద్యమంలో పాల్గొన్న బాబూజీ రాజ్యాంగ పరిషత్ సభ్యునిగానూ సేవలందించారు. స్వాతంత్య్రానంతరం తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో తొలి కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి, కార్మిక సంక్షేమానికి అహర్నిశలు పాటుపడ్డారన్నారు. కార్మిక పక్షపాతిగా గుర్తింపు పొందారు. బాబూజీ రెండు దఫాలు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగానూ సేవలు అందించారు. దేశవ్యాప్తంగా కరవు తాండవిస్తున్నప్పుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా హరిత విప్లవం విజయవంతంలో కీలక పాత్ర పోషించారు. రైల్వే, జాతీయ రవాణా శాఖ మంత్రిగానూ బాబూజీ తనదైన ముద్ర వేశారు. అంటరానితనం, కుల వివక్ష నిర్మూలనకు బాబూజీ తన జీవితాంతం పోరాడారు. దళితుల అభ్యున్నతికి ఎంతగానో పాటుపడ్డారు.