భారత్ సమాచార్, ఆరోగ్యం: సాధారణంగా ఏదైనా ఆహారం తినగానే కొద్దిమందికి ఛాతీలో, గుండెలో, పొట్టలో మంట పెట్టినట్లు అనిపిస్తుంది. ఇలా ఎందుకు అవుతుందంటే కడుపులోని ఆమ్లాలు అన్నవాహిక పైకి రావడం, గొంతు వైపు కదలడం వల్ల ఇలాంటి పెయిన్ వస్తుంది. దీనినే యాసిడ్ రిఫ్లక్స్ అని అంటాం. అయితే, మహిళలకు ప్రెగ్నెన్సీ సమయంలో తరుచుగా ఈ సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని ఆరోగ్య సూచనలు పాటిస్తే సరిపోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మహిళలు గర్భం దాల్చాక యాసిడ్ రిఫ్లక్స్ సమస్య ఎదురైతే కొన్ని సూచనలు పాటించాల్సి ఉంటుందని ఎయిమ్స్ వైద్యురాలు అపర్ణ తెలిపారు. ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలను కొన్ని సమస్యలు ఇబ్బంది పెడతాయని.. ఈ క్రమంలో యాసిడ్ రిఫ్లక్స్ కూడా ఒకటని ఆమె పేర్కొన్నారు. ఈ సమస్య నుంచి బయట పడేందుకు ఆమె గర్భిణీలకు పలు సలహాలు, సూచనలు చేశారు. అవేంటే ఇప్పుడు తెలుసుకుందాం.
యాసిడ్ రిఫ్లక్స్‌కి కారణం ఇదే..
గర్భం దాల్చినప్పటి నుంచి డెలివరీ వరకు గర్భిణీలకు కొన్ని అనుకోని సమస్యలు వస్తాయి. అది వారి ఆహారపు అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. వీటి నుంచి తమతో పాటు బిడ్డను రక్షించుకోవడానికి మహిళలు జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్నిసార్లు బిడ్డకు జన్మనిచ్చాక సమస్యలు తలెత్తొచ్చు. అయితే గర్భిణులకు తరచూ ఏర్పడే కామన్ ప్రాబ్లమే ఈ యాసిడ్ రిఫ్లక్స్. కడుపులో ఆమ్లాలు ఓకేసారి అతిగా ఉత్పత్తి అయినా, బేబీ పెరుగుదల కారణంగా వెన్నుపై ఒత్తిడి పెరిగినా ఈ యాసిడ్ రిఫ్లక్స్ సమస్య ఏర్పడుతుంది.
యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలు ఇవే
యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలను సులువుగా గుర్తించొచ్చు. కడుపు నిండిన భావన కలగడం, ఛాతీలో మంట పెడుతున్నట్లు అనిపించడం, తేన్పులు రావడం వంటి తదితర లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా తినగానే ఈ సమస్య ఎక్కువ అవుతుంటుంది. ఇంకా ఎక్కువ సేపు కడుపును ఖాళీగా ఉంచినా ఇలాంటి ఇబ్బంది ఎదురవుతుంది. అయితే వీటిలో ఎలాంటి లక్షణాలు కనిపించినా ముందే జాగ్రత్త పడాలని డాక్టర్ అపర్ణ తెలిపారు.
ఆహారపు అలవాట్లు మార్చాలి
గర్భిణీలు యాసిడ్ రిఫ్లక్స్ సమస్య నుంచి బయట పడాలంటే తినే ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. దీని కోసం రోజువారీ జీవన విధానంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే యాసిడ్ రిఫ్లక్స్ నుంచి సులువుగా బయటపడవచ్చు. ముఖ్యంగా తినే ఆహారంలో స్పైసీ, జంగ్ ఫుడ్, నూనెలు ఎక్కువగా ఉండే ఆహారం, ఫ్రైలు ఉంటే కూరలు తగ్గించాలి. కొంచెం కొంచెంగా సాధ్యమైనంత వరకు ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవాలి. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువగా ఆహారం తినాలని చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. అది సరికాదు. రోజూ ఎలా తింటామో..ఎంత తింటామో అంతే తినాలి. కెఫైన్ కలిగిన డ్రింక్స్‌ని దూరం పెట్టడం చాలా మంచిది. నిద్రకి, భోజనానికి కనీసం మూడు గంటల సమయం ఉండే విధంగా చూసుకుంటే చాలా మంచిది.
ఈ జాగ్రత్తలు పాటించండి..
పడుకునేటప్పుడు తల కాస్త ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. వీటితో పాటు రోజులో కనీసం 3లీటర్లకు పైగా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. తిన్న తర్వాత కనీసం ఒక 10 నిమిషాలు నెమ్మదిగా నడవాలి. ధూమపానం చేయడం గాని, చేసేవాళ్ల దగ్గర అసలు ఉండకూడదు. దీనితో పాటు ఆల్కహాల్ ముట్టు కోకూడదు. అన్నిటికన్నా ముఖ్యంగా మీకు ఏదైన సమస్య వస్తే యూట్యూట్ లేదా గూగూల్ లో వెతికి మీకు మీరే సొంత వైద్యం అస్సలు చేసుకోకూడదు. బేబీ ఎదుగుదలకు కావాల్సి సంతులిత ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా తగినంత నిద్ర పోవాలి. ఇవన్నీ పాటించినా సమస్య పరిష్కారం కాకపోతే వైద్యుడిని సంప్రదించడం మంచిది. ప్రెగ్నెన్సీపై దుష్ప్రభావాలు పడకుండా తగిన చికిత్స తీసుకోవాలి.