భారత్ సమాచార్, జగ్గంపేట ; ఈ ఎన్నికల్లో మొదటి నుంచి కూడా జనసేన పార్టీ ఉమ్మడి గోదావరి జిల్లాలపైనే స్పెషల్ ఫోకస్ పెట్టింది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా గోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నారు. పొత్తులో భాగంగా అత్యధిక సీట్లు కూడా గోదావరి జిల్లాల్లోనే తీసుకున్నారు. అత్యధికంగా ఎన్నికల ప్రచారం కూడా గోదావరి జిల్లాలలోనే చేస్తున్నారు. తాజాగా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడిలో జనసేనాని వారాహి విజయభేరి యాత్ర బహిరంగ సభ నిర్వహించారు. అధికార పార్టీ వైసీపీ పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు.
‘‘ఏ ఉద్యమం అయినా త్రికరణశుద్ధిగా జరగాలి. లేకుంటే అమాయకులు బలైపోతారు. కాపు రిజర్వేషన్ ఉద్యమంలో వైసీపీ నాయకులకు రిజర్వేషన్లు రావని ముందే తెలుసు. అయినా కాపులను మోసం చేయాలని, పన్నాగం పన్ని మరీ కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని వారికి అనుకులంగా మలుచుకున్నారు. కాకినాడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, తిరుపతి కరుణాకర్ రెడ్డి వంటి నాయకులు రిజర్వేషన్ రాదని తెలిసినా కాపులను కావాలని వారి అవసరానికి వాడుకున్నారు. ఉద్యమాన్ని విధ్వంసం బాటపట్టేలా ఎగదోశారు ’’అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. ఏ ఉద్యమం అయినా ఒక దశ దిశతో అహింసాయుతంగా ముందుకు వెళ్లాలన్నారు.
జగన్ ను కాపు నాయకులు ఎందుకు ప్రశ్నించలేదు?
కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం కుదరదని జగన్ ఖరాకండిగా చెప్పారు. అయినా కొంతమంది కాపు నాయకులు ఆయనకు మద్దతు తెలుపుతారు. జగన్ కు ఆ కాపు నాయకులు ఎలా మద్దతు తెలుపుతారని ప్రశ్నించారు? రిజర్వేషన్ అంశం కేంద్రం పరిధిలో ఉందని అనుకుందాం. కనీసం ఈబీసీ రిజర్వేషన్ లో కాపులకు ఇచ్చిన 5 శాతాన్ని వైసీపీ సర్కార్ తొలగించినా కాపు నాయకులు ఎందుకు మాట్లాడలేదు..? కాపులకు 5 శాతం కాదు రెండు, మూడు శాతమైనా ఇవ్వొచ్చు కదా..? అరశాతం కూడా రిజర్వేషన్ ఇవ్వని జగన్ కు ఎందుకు ఓట్లు వేయాలని నిలదీయండి. జగన్ కు ఓటు వేయాలని వచ్చే కాపు నాయకులను గట్టిగా నిలదీయండి.
జగన్ అవినీతిని అరికడితే ఎలాంటి పథకాలైన అమలు చేయచ్చు
రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా వైసీపీ నాయకుల అవినీతి, దోపిడీయే కనిపిస్తోంది. ఇసుక దోచేస్తున్నారు. మట్టిని మింగేస్తున్నారు. ప్రజలకు ఎలాంటి మేలు చేయని ఇలాంటి అరటిపండు తొక్క ప్రభత్వాన్ని ఇంటికి పంపించేద్దాం. జగన్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. కూటమి ప్రకటించిన పథకాలు అమలు సాధ్యం కాదని ప్రజలకు చెబుతున్నారు. వాళ్లు చేసే అవినీతిని అరికడితే పథకాలు సాధ్యమే. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి రూ.450 కోట్లు పక్కదారి పట్టించారు. జాతీయ ఉపాధి హామీ నిధులు దోచేశారు. చివరకు చిన్నపిల్లలకు పంపిణీ చేస్తున్న చిక్కీల్లో కూడా రూ.65 కోట్లు దోచేశారు. ఇసుక దోపిడీలో రూ.40 కోట్లు వెనకేసుకున్నారు. పంచాయతీ నిధులు రూ. 8వేల కోట్లు దారి మళ్లించారు. ఇలాంటివన్నీ ఆపితే కూటమి హామీలు అమలు చేయడం పెద్ద కష్టం కాదు.
ఏ ఒక్క కులం మీద కూడా సమాజాన్ని నిర్మించలేం
కాపు కులం అండ ఉందనే రాజకీయాల్లోకి వచ్చారా అని ప్రముఖ జర్నలిస్టు రాజదీప్ సర్దేశాయ్ నన్ను అడిగారు. దానికి నేను ఒకటే చెప్పాను. ఏ కులంలో పుట్టాలి..? ఏ రంగులో పుట్టాలి..? ఎంత ఎత్తులో పుట్టాలి..? మన చేతుల్లో లేదు. ఏ వ్యక్తి అయినా అన్ని కులాలను సమానంగా చూస్తేనే నాయకుడిగా ఎదుగుతాడు. ఆర్థిక, సామాజిక అసమానతలు సరిచేసుకుంటూ ముందుకు నడిపించాలి. సమాజం ఎప్పుడూ ఒక కులం పైన నడవదు. సమాజం ఒక కులం మీద నిర్మాణం కాదు. సమాజంపై అన్ని కులాలకు బాధ్యత ఉంటుంది. జ్ఞానం ఉన్న నాయకులు ఆచితూచి మాట్లాడతారు. నా వైపు యువత ఉందని నేను ఎప్పుడు వాళ్లని రెచ్చగొట్టి విధ్వంసం వైపు నడిపించలేదు. వారికి బంగారు భవిష్యత్తు ఉండాలని నిర్మాణాత్మకంగా మాట్లాడాను. జగ్గంపేటలో ఉన్న ప్రతి ఒక్క స్థానిక సమస్యను పరిష్కరిస్తామని కూటమి అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.