భారత్ సమాచార్, అంతర్జాతీయం ;
కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం,
జాలరి పగ్గం, సాలెల మగ్గం,
శరీర కష్టం స్ఫురింపజేసి
గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి
సహస్రవృత్తుల సమస్త చిహ్నాలు
నా వినుతించే, నా విరుతించే
నా వినిపించే నవీనగీతికి
నా విరచించే నవీన రీతికి
భావం, భాగ్యం, ప్రాణం, ప్రణవం
– శ్రీ శ్రీ
శ్రమిద్దాం.. శ్రమని గౌరవిద్దాం.
చెమట చుక్క విలువను కాపాడుకుందాం.
కలిసి కట్టుగా కార్మిక హక్కులపై పోరాడుదాం.
కార్మిక ప్రపంచ కామ్రేడ్స్ కు ‘మే డే’ శుభాకాంక్షలు అంటూ దేశ ప్రముఖ రాజకీయ వేత్తలు, పారిశ్రామిక వేత్తలు, సినీ సెలబ్రిటీలు, ప్రముఖ క్రీడాకారులు ఆన్ లైన్ వేదికగా తమ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఐక్యరాజ్యసమితి లోని అత్యధిక దేశాలు జరుపుకునే అంతర్జాతీయ వేడుకల్లో మే డే ఒకటి. దీన్ని అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అని కూడా చాలా చోట్ల అంటారు. అమెరికా లో మాత్రం ‘లాయల్టీ డే’అని అంటున్నారు. ప్రస్తుతం చాలా దేశాల్లో మే డే ని అధికారికంగా సెలవు రోజుగా ప్రకటించారు. భాష, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్మికులు రోజుకి 8 గంటల పని విధానం కోసం గళమెత్తారు. వారి నిరసనల ఫలితమే మే డే. ఈ కార్మికుల నిరసనల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది అమెరికా షికాగోలోని హే మార్కెట్ జరిగిన సంఘటన గురించి. రోజుకి 8 గంటల పని విధానం తమ హక్కుగా 1886, మే1న చాలామంది కార్మికులు పోరాటం మొదలు పెట్టారు. హే మార్కెట్ లో వందల మందితో నిరసన కూడా నిర్వహించారు. కానీ అనుకోకుండానే ఈ ప్రదర్శన ఉద్రిక్తంగా మారిపోయింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. కార్మికులపై కాల్పులు కూడా జరిపారు. దీంతో కొద్ది మంది కార్మికులు చనిపోయారు.
ఈ సంఘటన తర్వాత 1889 నుంచి 1890 వరకు అనేక దేశాల్లో కార్మికుల ఉద్యమాలు, నిరసన ప్రదర్శనలు వరుసగా చోటు చేసుకున్నాయి. ఇందులో మరో ముఖ్య ఘటన 1890, మే 1న బ్రిటన్లోని హైడ్ పార్క్లో చోటుచేసుకుంది. ఈ నిరసన ప్రదర్శనకు దాదాపు 3 లక్షల మంది కార్మికులు హాజరయ్యారు. రోజుకి 8 గంటల పని మాత్రమే చేయాలనేది వారి ప్రధాన డిమాండ్. ఆ తర్వాత అనేక యూరోపియన్, పశ్చిమ, ఆసియా దేశాల్లో ఇదే నినాదంతో భారీ నిరసన ప్రదర్శనలు జరిగాయి. చాలా దేశాల్లో కార్మికుల డిమాండ్స్ ని కూడా అంగీకరించారు. కాల క్రమంలో షికాగోలో జరిగిన కార్మిక ప్రదర్శనలో చనిపోయిన కార్మికులకి గుర్తుగా మే 1 ని కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు. ఇందుకు మెజార్టీ దేశాలు కూడా అంగీకరించాయి.