భారత్ సమాచార్, జాతీయం ; మార్కెట్లో అమ్ముతున్న ప్రతి వస్తువుకి కచ్చితంగా వారంటీ లేక గ్యారంటీ కచ్చితంగా ఉంటుంది. ప్రతి వినియోగదారుడు కూడా వస్తువులను కొనుగోలు చేసే ముందు ఈ విషయాల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. లేకపోతే చాలా సార్లు మోసపోయే అవకాశం ఉంది. మనం ఇప్పుడు వారంటీ, గ్యారంటీ ల మధ్య తేడా ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ ప్రతి ఒక్క వినియోగదారుడు కచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీరు కొనుగోలు చేసిన వస్తువులపై గ్యారంటీ లేక వారంటీల లబ్దిని పొందాలనుకుంటే మీ దగ్గర కచ్చితంగా ఆ వస్తువు యొక్క బిల్లు లేక వారెంటీ కార్డు తప్పని సరిగా కలిగి ఉండాలి. మీ దగ్గర వస్తువుకు చెందిన బిల్లు ఉన్నప్పుడు మాత్రమే మీరు గ్యారంటీ లేక వారంటీని పొందగలుగుతారు. కొన్ని సందర్భాల్లో సదరు సంస్థ వస్తువులను మార్చడానికి నిరాకరిస్తే లేదా మరమ్మతు చేయడానికి నిరాకరిస్తే అప్పుడు వినియోగదారుడు వినియోగదారుల న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు.
వారంటీ అంటే ఏంటి?
మీరు మార్కెట్లో ఏదైనా వస్తువును కొనుగోలు చేసినప్పుడు ఆ వస్తువు పాడైపోయినట్లయితే అదే ఉత్పత్తిని దుకాణదారు/సంస్థ రిపేర్ చేసి కస్టమర్‌కు అందించే హామి పత్రం లేక బిల్లు అని చెప్పవచ్చు. దీన్ని ఏదైనా ఉత్పత్తి లేదా వస్తువు యొక్క వారంటీ అంటారు. అయితే దీనిని పొందడానికి కొన్ని షరతులు కూడా ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి ఏంటంటే? కస్టమర్ కొనుగోలు చేసిన వస్తువు కోసం ధృవీకరించబడిన బిల్లు లేదా వారంటీ కార్డును కచ్చితంగా కలిగి ఉండాలి. చాలా వస్తువుల విషయంలో వీటి కాల పరిమితి 1 సంవత్సరం వరకు ఉంటుంది. ఈ సమయం ముగిసిన తర్వాత వినియోగదారుడు ఉత్పత్తిని రిపేర్ కోసం దుకాణదారు వద్దకు తీసుకెళ్తే, దానిని రిపేర్ చేయడం దుకాణదారుడి బాధ్యత కాదు.
గ్యారంటీ అంటే ఏమిటి ?
గ్యారెంటీ వ్యవధిలో (సాధారణంగా చాలా వస్తువులకు 1 సంవత్సరం ఉంటుంది) వస్తువు పాడైపోయి, ఉత్పత్తిపై 1 సంవత్సరం గ్యారెంటీ రాసి ఉంటే దుకాణదారుడు కస్టమర్‌కు కొత్త వస్తువును అందించడానికి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పాత లేదా పాడైపోయిన వస్తువుకి బదులుగా కొత్త వస్తువును ఇవ్వడాన్ని గ్యారంటీ అంటారు. అయితే దీనిని పొందడానికి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాటిలో మొదట వినియోగదారులు కొనుగోలు చేసిన వస్తువు కోసం ధృవీకరించబడిన బిల్లు లేదా హామీ కార్డును కలిగి ఉండాలి. పాడైపోయిన ఉత్పత్తిని గ్యారెంటీ వ్యవధి ముగిసేలోపు దుకాణదారునికి తీసుకెళ్లాలి అప్పుడు మాత్రమే ఆ ఉత్పత్తికి బదులుగా కొత్త ఉత్పత్తి అందిస్తారు.
గ్యారెంటీ, వారంటీల మధ్య తేడా…
- పాడైన వస్తువు వినియోగదారునికి ఇస్తే వారంటీ కింద ఆ ఉత్పత్తిని దుకాణదారుడు లేదా కంపెనీ రిపేర్ మాత్రమే చేసి ఇస్తుంది. గ్యారెంటీలో మాత్రం ప్రొడక్ట్ పాడైపోయినా లేదా సరిగ్గా పని చేయకపోయినా మీరు దానిని దుకాణదారునికి తీసుకెళ్తే కొత్త వస్తువుని పొందవచ్చు.
- వారంటీ అనేది నిర్ణీత కాల వ్యవధిలో ఉంటుంది. కానీ కొంచెం ఎక్కువ డబ్బు చెల్లించడం ద్వారా దానిని పొడిగించుకునే అవకాశం ఉంటుంది. కానీ గ్యారంటీ వ్యవధి మాత్రం పొడిగించటానికి వీలు పడదు.
- మార్కెట్లో లభించే మెజార్టీ వస్తువులపై వారంటీ అందుబాటులో ఉంటుంది. కానీ కొన్ని ఎంచుకున్న వస్తువులపై మాత్రమే కంపెనీలు వినియోగదారులకి గ్యారెంటీని అందుబాటులో ఉంచుతాయి.