Homemain slidesఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కు చివరి రోజులు

ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కు చివరి రోజులు

భారత్ సమాచార్, హైదరాబాద్ ;

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు పోలింగ్ పూర్తి కావటంతో సాధారణ పరిపాలనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వచ్చే జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలో పునర్విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. పునర్విభజన చట్టంపై చర్చించడానికి ఈ నెల 18న తెలంగాణ కేబినేట్ సమావేశం నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. షెడ్యూలు 9, షెడ్యూలు 10 లో పేర్కొన్న మేరకు పెండింగ్ లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్ల అంశాలు, ఉద్యోగుల కేటాయింపు, ఆస్తులు, అప్పుల పంపిణీ వంటి అంశాలన్నింటిపై నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. పదేండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ కేవలం తెలంగాణ రాష్ట్ర రాజధానిగా మారనుంది. ఈ పదేండ్ల కాలానికి ఏపీకి కేటాయించిన లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ వంటి భవనాలను జూన్ 2 తర్వాత రాష్ట్ర అధీనంలోకి తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.

రైతులకు రూ. 2 లక్షల మేరకు రుణమాఫీకి సంబంధించి విధి విధానాలతో అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల రుణమాఫీ కోసం అవసరమైతే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు నిధులు ఇచ్చేందుకు ముందుకొచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలని సూచించారు. ఈ విషయంలో మహారాష్ట్ర, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలను అధ్యయనం చేయాలని కోరారు. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, దళారుల జోక్యం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతు నుంచి పంటను కొని మిల్లింగ్ చేసి రేషన్ షాపుల్లో సన్న బియ్యం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కల్లాల వద్ద రైతులు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమాలకు పాల్పడే రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మరికొన్ని రాజకీయ విశేషాలు…

అన్నదాతలకు అండగా రాష్ట్ర వ్యాప్త నిరసనలు

RELATED ARTICLES

Most Popular

Recent Comments